Monday, July 2, 2012

బానిసత్వంలో మన భారతీయం........









ఈ ఆదివారం ఈనాడు బుక్ ఈ వారం ప్రత్యేకంశీర్షికలో మనం ఎందులో ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉన్నామో చాలా చక్కగా చెప్పారు. బ్రిటీషువారి బానిసత్వం నుంచి బయటపడిన అరవై ఏళ్లలో ఇన్ని రంగాలలో మనం ముందు ఉంటే........ మరి మనం మిగతా బానిసత్వాల నుంచి కూడా విముక్తి పొందితే....... ప్రపంచంలో ప్రతీ రంగంలోనూ మనదే మొదటిస్థానం...... అందులో సందేహించాల్సినది ఇసుమంతైనా లేదు అని నాకనిపిస్తుంది.
 బానిసత్వాలా ..... అదేంటి? మనం ఇంకా బానిసత్వంలో ఉన్నామా?
అవును...... మనం ఇంకా బానిసత్వంలో ఉన్నాము.........
అదేంటి మనం బానిసత్వంలో ఉన్నాము అంటున్నావ్? మనం బానిసత్వం నుంచి బయట పడి ఆరవై ఏళ్ళు పైబడింది  కదా....
అవును మనం రెండువందల ఏళ్ళు బానిసత్వంలో గడిపి, తెల్లవాళ్ళను మన దేశం నుంచి తరిమేసాం కరక్టే, కానీ ఆ తరవాత మనం చాలా వాటికి బానిసలమైపోయాం, మరి రెండువందల ఏళ్ళు అలవాటు పడిపోయాము కదా, ఏదో ఒక దానికి బానిసలుగా ఉండకుంటే మనకు రోజు గడవడం కష్టం.
అదేంటి బానిసత్వం నుంచి బయటికి వచ్చాము అంటావ్ మరీ బానిసలమైయిపోయాము అంటావ్ ఏంటి బాబు  ఈ కన్ఫ్యూజన్ మాకు...
ఈ అరవై ఏళ్లలో మనం కొన్నింటికి మానసికంగా దాసోహం అయిపోయాం, ఎంతగా అంటే ఒక్కోకటీ ఒక మానసిక రుగ్మతగా మారి మన జీవితాలను శాసించేన్తగా......
*****
మనిషి సంఘజీవి.... సంఘoలో మనిషి తన దైనందిన జీవితంలో సౌకర్యంగా ఉంటుందని తలచి మొదలు పెట్టిన వ్యవస్థ కులవ్యవస్థ.... అది ఒక సాంఘిక కట్టుబాటుగా మొదలై మనిషికీ మనిషికీ మధ్య గోడ లా మారింది.
చేసే వృత్తి ఆధారంగా విభజించబడి మొదట నాలుగు వర్ణాలతో మొదలై, నాలుగో వర్ణం నుంచి పంచమవర్ణం పుట్టి అలా అలా దాదాపు రెండు వేల సంవత్సరాలలో సమాజంలో వస్తూన్న మార్పులకు అనుగుణంగా, పుట్టుకొస్తూన్న కొత్త కొత్త వృత్తులను చేర్చుకొంటూ ఎన్నో చీలికలతో, చిలవలు పలవలుగా ప్రతీ వర్ణం విభజించబడింది, ఇప్పుడు లెక్కపెడితే మనకు వర్ణాలకు అంతేలేదు. కానీ ఇదంతా మధ్యయుగాల వరకే....
మధ్యయుగాల తరవాత మన కులవ్యవస్థలో మార్పు నిలిచిపోయింది, సమాజంలో వచ్చిన, వస్తూన్న మార్పులకు అనుగుణంగా మన కుల వ్యవస్థలో మార్పులు జరగడం ఆగిపోయింది. 
మధ్యయుగం తరవాత అంటే ఇప్పుటి ఆధునిక కాలానికి అనుగుణంగా మన కులవ్యవస్థలో మార్పులు వచ్చి ఉంటే, మా నాన్న కులం ఉద్యోగస్తుల కులం. ప్రధానంగా అందులో ప్రభుత్వ ఉద్యోగస్తుల కులం అన్నది ఒక తెగ. ఆ తెగ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అనే మరో చిన్న వర్గం అనీ, నేను నాకులం ఉద్యోగస్తుల కులం  అందులో మరొక తెగ ప్రైవేటు ఉద్యోగస్తులు అనీ, అందులో మళ్ళీ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు అన్న చిన్న వర్గం, అందులో ఇంకా లోతుగా వెళితే NRI సాఫ్ట్ వేర్ వర్గం అని చెప్పుకొని ఉండాలి.
ఏంటి కామెడీ........ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తుల కులమేంటి? అందులో చిన్న తెగలు, వర్గాలు ఏంటి?
మన కుల వ్యవస్థకు మనం చేసే వృత్తే ప్రాతిపదిక అయితే, మరి నేను చెప్పినదాంట్లో తప్పేంటి? మనం  చెయ్యని వృత్తి మన కులం ఎలా అవుతుంది?
చెయ్యని వృత్తిని కులం గా చెప్పుకొంటూ, ఇంకొకడికంటే తామేదో గొప్ప అని కేవలం కుల ప్రాతిపదికగా చెప్పుకొంటూ, పేర్ల వెనకాల కులం పేర్లు తగిలించుకొని, మనిషికీ మనిషికీ మధ్య కేవలం కుల ప్రాతి పదిక మీద తేడాలు చేస్తూ, ఎప్పుడో వందల ఏళ్ళ వెనకాలే ఎదుగుదల ఆగిపోయి కాలం చెల్లిన వ్యవస్థ ను అపురూపంగా చూసుకొంటూ బ్రతుకుతున్న మన ప్రస్తుత పరిస్థితి చూస్తే, మనం దానికి ఎప్పుడో బానిసలమైపోయాము అనడంలో నిజం లేదా?
ఎన్నికలలో మనం ఓటు వేసేది మన కులపోడికి, ప్రభుత్వ కార్యాలయాలలో మన కులస్తుడు అంటే పనులు చక చకా జరిగి పోతాయి, మన కులస్తుడు బాగా డబ్బున్నోడైతే మనం గొప్పగా ఫీల్ అవుతాం, మన కులపోడు తప్పుచేస్తే అది ఒక తప్పేకాదు మనకు, మన కులపోడే ఎప్పుడూ ముఖ్యమంత్రి కావాలి, ఒక నటున్ని అభిమానించాలంటే కులమే ప్రాతిపదిక మనలో చాలా మందికి..... వావ్........ యిలా చెప్పుకొంటూపోతే ఎన్నో......
పరాకాష్ట ఏంటంటే...... వేమన మా కులస్తుడు, కృష్ణదేవరాయలు మాకులస్తుడు.... ఈ పైత్యం ఎక్కువయ్యింది ఈ మధ్య.... ఆ మహానుభావులకు మన మూర్ఖత్త్వాన్ని ఆపాదించి గొప్పగా ఫీల్ అవ్వడమంటే ఇంతకన్నా నిదర్శనం కావాలా కులవ్యవస్థకు మనం ఎంత బానిసలమైపోయామో చెప్పటానికి.
అసలు ఈ అరవై ఏళ్లలో కులం అన్న దాని అవసరం, ప్రభావం తగ్గించే ప్రయత్నం ఏదన్నా జరిగిందా? తగ్గించే కంటే పెంచే ప్రయత్నమే ఎక్కువ జరిగిందనుకుంటా.... యిప్పటి ఓటు బ్యాంకు రాజకీయ వ్యవస్థకు ముఖ్య ఆయుధం కులం. ఇంక కుల వ్యవస్థ ప్రాధాన్యం ఎక్కడ తగ్గు తుంది, కుక్క బిస్కెట్ పథకాలకు ఆశపడుతూ, కుల ప్రాతిపదికన ఓటు వేస్తూ వెళితే ఇది ఇలాగే ఇంకా పెరిగి కొంతమందికి అధికార, ధనసంపాదన మార్గంగా ఇలా వర్దిల్లుతూ, వీలైనంత వికృతంగా పెరుగుతూనే ఉంటుంది.
  
రిజర్వేషన్ వ్యవస్థకు ముఖ్య ప్రాతిపదిక కులం. అది ఎంత వరకూ సక్రమంగా అమలయ్యింది.... ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా అభివృది పరచాలంటే అరవై ఏళ్ళు సరిపోవా.... ఇన్నిసార్లు మన రాజ్యాంగంలో దాన్ని సవరించ వలసిన అవసరం ఉందా?..... అభివృద్ధి చెందకూడదు అని మన ఓటు బ్యాంకు రాజకీయ వ్యవస్థ నిర్ణయిస్తే అందుకు మనం తల ఆడిస్తూ మరీ మరీ అదే కుల ప్రాతి పదిక మీద మన నాయకులని ఎన్నుకొంటూ పోతే ఆరువందల ఏళ్ళు కూడా సరిపడవు అందులో నుంచి బయటికి రావడానికి మనకు...
స్కూల్ లో పిల్లవాడిని చేర్పించాలంటే అప్లికేషను కులం, మతం ప్రస్తావన ఎందుకొ అర్థం కాదు...
ప్రభుత్వ కార్యాలయాలకు సంభందించిన ఎన్ని పత్రాలలో కులం, మతం ప్రస్తావన ఉంది? ఎందుకుండాలి?
ప్రైవేటు విద్యాలయాల అప్లికేషన్లలో కుల, మత ప్రస్తావన ఉంది?..... ఎందుకు?.....
 మనిషే మనిషిని మనిషిగా గుర్తింపచెయ్యలేని వ్యవస్థ మీద మనకు మక్కువ ఎక్కువ.
 ఇక తరవాత వరసలో ఉంది డబ్బు...... డబ్బు అదికూడా మన సౌకర్యం కోసమే పుట్టింది, కానీ మన జీవితం ప్రతీక్షనమూ దాని నియంత్రణలోనే ఉంది యిప్పుడు...... డబ్బు ఉన్న వాడే కింగు.... అది ఎలా వచ్చిందో ఎవరికీ అవసరం లేదు.....ఎన్ని తప్పుడు మార్గాలలో సంపాదించాడో అవసరం లేదు... ఎంత సంపాదించాడు అన్నదే పాయింట్, ఇక దానికి తోడు ఆ అక్రమార్కుడు మన కులపోడైతే....... ఇంద్రుడూ..... చంద్రుడూ.....భలాదూర్.... అన్నీ మావాడే.....
 
వీటి తరవాత వరసలో ఉంది టీవీ సీరియళ్ళు........
కులం అన్నావు... సరే..... డబ్బు అన్నావు.... సరే.... రాజకీయవ్యవస్థ అన్నావు.... ఓకే..... టీవీ సీరియళ్ళు ఏమిచేసినాయి బాబూ.... అదే మనకున్న ఓకే ఒక్క ఎంటర్టైన్మెంట్ కదా......
ఓకే ఒక్క ఎంటర్టైన్మెంట్........ అని చెప్పడం లోనే ఉంది కదా మనం ఎంత బానిసలమో వాటికి.......
రియాలిటీ షోలు వదిలెయ్యండి.... ధారావాహికల గురించి నేను చెప్పేది..... ఎలా చూస్తున్నారో, చూసి ఎలా భరిస్తున్నారో ఆ రోత..... పిల్లలకూ బలవంతంగా వాటినే చూపించి ఇళ్ళల్లో ఇలాంటి కుట్రలూ కుతంత్రాలూ సహజమే అనేట్టు తయారుచేస్తున్నాం వాళ్ళని.... కొంతమంది ఒక రోజు ఒక ఎపిసోడు చూడటం జరగకపోతే జీవితంలో ఏదో కోల్పోయామన్నంత హడావిడి చెయ్యడం చూస్తే..... నాకు అది ఎంటర్టైన్మెంట్ అనిపించడంలేదు అదో మానసిక రుగ్మత అనిపిస్తుంది..... ఆ అర్థం లేని నిరంతరధారకు మనం బానిసలమయిపోయాం అనిపిస్తుంది........ఈ ఒక్క విషయంలో IPL కు థాంక్స్ చెప్పవలసిందే కొంతవరకూ.......
ఎంత వరకూ?......
దానికీ మనం బానిసలం కాకున్నంత వరకూ.......
అ... అ.... ఆ.... ఏవిటీ.......ఆల్రెడీ అయ్యామా....... గోవిందో..... హరి........
ఐనా అది స్పోర్ట్స్ కదా పరవాలేదులెండి, అదీకాక సీజనల్ కదా.....
 
ఇకపోతే ప్రాంతీయతత్వం..... ఏమిచెప్తాము చెప్పండి... దీనికి ఒక హద్దు, అంతూ లేదు....  తూర్పు.....పడమర......ఉత్తరం.....దక్షినం....... చారిత్రకం....... రాజకీయం...... ఏదన్నా కావచ్చు ప్రాతిపదికం......... ప్రాంతీయతత్వానికి ఎప్పుడూ బానిసలమే మనం......
ఇలా చెప్పుకుంటూ పోతే......
సెల్లు ఫోను...... ఇది ఒక్కటి చేతిలో ఉంటే చాలు..... ఎంత సమూహంలో ఉన్నా ఒంటరివారమే...... దానికి సమాధానం చెప్పటమో, లేక దాన్ని ఎంటర్టైన్ చెయ్యడమో..... ఈ రెండే మన పనులు.... పక్కన ఏమి జరుగుతోందో అవసరం లేదు......మన కోసం, మన చేత పుట్టిన అది ఎప్పుడో మనల్ని జయించేసింది.....
ఇంటర్నెట్, పేస్ బుక్కు.......యువతరం అంతా టెక్నాలజీ బానిసలు......
*****
నువ్వు మరీ చెపుతున్నావు బాబు..... మరీ అంతలేదులే..... అంటారా....
ఎంత అనేది నేను చెప్పలేను, అది ప్రతిఒక్కరూ తమకు తామే చెప్పుకోవలసిన సమాధానం.....అంతే.
*****
ఎవరో వస్తారని........ ఏదో చేస్తారని..... ఎదురుచూసి మోసపోకుమా...... నిజము మరచి నిదురపోకుమా......

Sunday, June 17, 2012

నాన్నా..... నువ్వే మా కెప్టన్.


ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను... చాలా టచ్చింగ్ గా ఉంటుంది.
ఫాదర్స్ డే సందర్భంగా అందరికోసం మరొక్క సారి.....
My promise to my children - as long as I live I am your parent 1st, your friend 2nd.

I will stalk you, flip out on you, lecture you, drive you insane, be your worst nightmare and hunt you down like a bloodhound when needed because I LOVE YOU!

When you understand that I will know you are a responsible adult. You will NEVER find someone who loves, prays, cares & worries about you more than I do! If you don’t hate me once in your life – I am not doing my job properly.

చదువుతున్న ప్రతీసారి ఎంత నిజముంది అందులో...ప్రతీ నాన్నా అలాగే  ఉంటారా... అనిపించింది నాకు.
మా నాన్న మాత్రం నాకు అలాగే అనిపిస్తారు.

అవును...నేను ఆయనను హేట్ చేసాను.. ఒక్క సారి కాదు చాల సార్లు... సైకిల్ కొనివ్వలేదని, ప్యాంటు కాకుండా నిక్కర్లు కుట్టించారని, పైసలు సరిపడా ఇవ్వలేదని... అదనీ...ఇదనీ...ఇంకేదో అని..... పిల్ల తనం, మూర్ఖత్వం, అమాయకత్వం, మొండితనం ఏదన్నా కావచ్చు....

కానీ నేను ఇప్పుడు ఉన్న స్థితికి మా నాన్నే కారణం, ఆయన ఆ రోజు అలా ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఇలాఉన్నాను, ఆయన అలా కాక విచ్చల విడితనంగా అడిగినదంతా ఇచ్చి ఉంటే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో చెప్పలేను కానీ ఈస్తితికి మాత్రం వచ్చిఉండేవాడిని కాదు అనిమాత్రం ఘంటాపథంగా చెప్పగలను.

 నా డిగ్రీ తరవాతే మా నాన్న ఎంత కరెక్టో తెలిసి రావడం మొదలయ్యింది.

డిగ్రీ అయినతర్వాత హైదరాబాద్ లో గాంధీ నగర్లో ఫ్రెండ్స్ తో పాటు రూంలో ఉండి సివిల్ సర్వీసెస్ కు(UPSC) చదివే వాడిని, నా మొదటి ప్రయత్నం లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను... ఎమి చేస్తాం మన రైటింగ్ బాడ్, మెయిన్స్ లో అదే దెబ్బ కొట్టింది.... కానీ ఇప్పటికీ నేను గర్వ పడే విషయం అది, ఎందుకంటె ప్రతీ ఏడు దేశం మొత్తం కేవలం పదివేలమంది ప్రిలిమ్స్ క్లియర్ చేసేవారు అప్పట్లో, ఉన్న నాలుగు ప్రయత్నాలూ ముగించుకొని ఒక్క సారి కూడా కేవలం ప్రిలిమ్స్ పాస్ కాకుండా పెట్ట సర్దుకొని ఊరు వెళ్ళే వాళ్ళు ఎంత మందో ప్రతీ సంవత్సరం నాకు తెలుసు. నా రెండవ ప్రయత్నం లోనూ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ మళ్ళీ దెబ్బ పడింది..... నా ప్రిలిమ్స్ పాస్ కావడంలో మా నాన్న పాత్ర ఉంది, ఏంటంటే ప్రిలిమ్స్ లో నా సబ్జెక్టు హిస్టరీ నా మొత్తం ప్రీపరషన్ దాని మీదే, రోజుకు పద్దెనిమిది నుండీ ఇరవై ఘంటలు చదివేవాడిని అంటే కొంతమంది నమ్మక పోవచ్చు కానీ అదినిజం, కానీ నేను నా జనరల్ నాలెడ్జ్ పేపర్ కు అంత శ్రమ పెట్టలేదు అసలు శ్రమే పెట్టలేదు అంటేనే కరెక్ట్, కారణం ఏంటంటే నా పదవ తరగతి నుంచే మా నాన్న మాకోసం రెగ్యులర్ గా competition success తెప్పించే వారు నేను నా క్లాసు పుస్తకాలు చదవక పోయినా competition success మాత్రం రెగ్యులర్ గా చదివే వాడిని, అది మానాన్న నా ప్రిలిమ్స్ సక్సెస్ లో నిర్వహించిన పాత్ర.

మెయిన్స్ మళ్ళీ దెబ్బ పడింది అన్నా కదా, ఆప్పుడు తెలిసింది మా నాన్న ఎంత కరెక్ట్ రా అని, నా చిన్నప్పుడు మా నాన్న పదే పదే ఒక విషయం చెప్పే వారు ఏమిటంటే, చదవండి రా చదువే మీకు రేపు అన్నం పెట్టేది, మీరు పెద్ద అయ్యాక మరీ చదవాలంటే మరీ చిన్న వాళ్ళు కాలేరు కాబట్టి ఇప్పుడే బాగా చదవండి అని..... అది ఆయన తన అనుభవంతో చెప్పిన మాట.....నా చదువంతా అత్తెసరు మార్కులతోనే గడిచింది నేను ఎప్పుడూ ఖంటస్తం కొట్టింది లేదు ఇంత వరకూ ఏ విషయం, అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినది రాసేవాడిని, స్కూల్లో ఎప్పుడూ ఒకటే గొడవ, నీ సొంత కవిత్వం ఎందుకు రా పుస్తకం లో ఉన్నది రాయలేవా అని.....సరే వదిలెయ్యండి మన విద్యా విధానం గురించి విపులంగా తారవాత మాట్లాడుదాము, ఇక్కడ నేను చెప్పేదేమంటే నేను నా మెయిన్స్ లో రెండు సార్లు ఫెయిల్ అయ్యినప్పుడు అదీ కేవలం నా రైటింగ్ వల్ల..... చిన్నప్పటినుంచి మనం చెయ్యలేదు అది ఇప్పటికిప్పుడు రావాలంటే ఎక్కడినుంచి వస్తుంది.... నాన్న ఎంత కరెక్ట్ రా..... ఇప్పుడు మనం మరీ చిన్న వాళ్ళమై పోయి అప్పుడు చదవని చదువంతా చదవలేము కదా..... అప్పుడే నాన్న మాట విని ఉంటే అని ఎన్ని సార్లు అనుకోనిఉంటానో యిప్పటికీ.

సరే ఆ తరవాత మరొక్క ప్రయత్నం చేసి ఇక మనకు ఓపిక లేదు అని(ఒక సారి రాయాలి అంటే ఒక సంవత్సరం ఆగాలి), మా నాన్నను ఒప్పించి సాఫ్ట్ వేర్ కోర్స్ లో చేరి అక్కడ కూడా మొదటి ప్రయత్నం లోనే జాబు కొట్టి ఇదిగో ఇలా అమెరికాలో పడ్డాను.

సాఫ్ట్ వేర్ కు షిఫ్ట్ కావడానికి ముఖ్య కారణం, అప్పటికే మా నాన్నా రిటైర్ అయ్యారు, ఇక ఇంకా వారికి భారంగా ఉండ కూడదన్న కారణమే నన్ను ఆ వైపు నడిపించింది. అందుకు ఆయన జీవితమే నాకు స్పూర్తి, ప్పటికీ.....ఎప్పటికీ....
****
మా నాన్న పదకొండు మంది సంతానం లో అగ్రజుడు, మా తాత బ్రిటీషు వారి హయాములో ఒక పోలీసు కానిస్టేబుల్. అనంతపురం లో పాత పోలీసు క్వార్టర్స్ లో ఉండే వారు, మా నాన్న నన్ను ఒక సారి పోలీస్ లైన్స్ లో తాము ఉన్న ఇల్లు చూపించారు(అప్పటికి అవి శిథిలావస్తలో ఉండేవి), నాకు ఆశ్చర్యం వేసింది అంత చిన్న గదిలో అంత మంది ఎలా ఉండేవారో అని, పోలీస్ లైన్ స్కూల్ లో మరియూ గోవర్నమేంట్ హై స్కూల్ లో చదివి, పదవ తరగతికే టైపు హయ్యర్, షార్ట్ హండు చేసిన ఆయన ఇంటికి ఆర్థికంగా సహాయంగా ఉంటుందని అనంతపురం కోర్ట్ లో టైపిస్టుగా పనిచేస్తూ చదువుకొన్నారు. అలానే అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ పూర్తీ చేసారు ఆయన. చదువే ధ్యేయంగా ఆయన ఆ కాలేజీ లో చదివితే అదే కాలేజీ లో మనం అల్లరే ధ్యేయంగా గడిపాము మూడు సంవత్సరాలు....

ఇప్పటికీ బాగా గుర్తు ఆయన తన చిన్న తనం లో గడిపిన జీవితం, సంఘటనలూ అప్పుడప్పుడూ చెప్పేవారు, నా ఆలోచనా సరళి లో దాని ప్రభావం చాలా......

వేర్ హౌస్ కార్పోరేషన్ లో(Warehousing Corporation) సికిందరాబాద్ రీజినల్ మానేజరుగా రిటైర్ అయ్యారు ఆయన....తాతల ఆస్తులు లేవు కానీ ఆయన సక్సెస్ లో నేను చూసినది నిబద్దత, పట్టుదల, విషయ పరిజ్ఞానం....

ఆస్తులు అంతస్తులు అవసరం లేదు..... ఆయన చేతల ద్వారా ఆయన జీవితం ద్వారా నేను నేర్చుకున్నది, జీవితం లో డబ్బు కాదు ప్రధానం, ఏదన్నా సాధించడానికి ధృఢసంకల్పం ముఖ్యం....


నా జీవితానికి దిశ, దశ లను నిర్దేశించిన కెప్టెన్......
నాకు ఎన్ని జన్మలు ఉన్నా మీరే నా నాన్న.....

 ***** 

(కాప్టెన్, అని ఎందుకన్నానంటే... వేర్ హౌస్ మేనేజర్ కాక ముందు ఆయన ఆర్మీ లో కెప్టెన్ గా ట్రైనింగ్ పొందారు. ఇప్పటికీ అనంతపురం లో అయన పాత స్నేహితులు ఆయనను కాప్టెన్ శ్రీరాములు అనే పిలుస్తారు)

(సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో నా సక్సెస్ కు నా మిత్రుడు రాజు సహాయం ఎప్పటికీ మరువలేనిది, నేను చదివిన హిస్టరీ పుస్తకాలన్నీ రాజు పుస్తకాలే)