Saturday, April 21, 2012

కృషి ఉంటే మనుషులు......


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు....

ఏంటి రాజకీయ నాయకుడి లా మాట్లాడుతున్నావ్.... అంటారా...

ఏదో ఆవేశం వచ్చినప్పుడు అలా వస్తూఉంటాయి... అర్థం చేస్కోండీ...

ఒక మహానుభావుడు మరో మహానుభావునికి రాసిన పాట గుర్తుకొచ్చి అలా అన్నాను..

ఎవరా ఇద్దరు మహానుభావులు బాబు అని మీరు ఆల్రెడీ ప్రశ్నించి వుంటారని నాకు తెలుసు... చెప్తాను...చెప్తాను ఆగండి

ఒకరు నట సార్వభౌముడు మన అన్న గారు... ఇంకొకరు తెలుగు పదాలతో సిరిసిరిమువ్వలు పలికించిన మన వేటూరి గారు..

అన్న గారి మీద అభిమానం ముప్పై సంవత్సరాల నాటిది...అంటె మనం నిక్కర్లు వేసుకొని తెరిగే నాటినుంచి అది మన నర  నరాలలో జీర్ణించుకొని పోయింది అన్నమాట....దాని గురించి చెప్పాలంటే ఒక పోస్ట్ సరిపోదు... కాబట్టి ఇంకోసారి బాగా తీరిక వున్నప్పుడు మాట్లాడుకొందాం..

ఇకపోతే మన వేటూరి వారు... ఎమి చెప్తాము చెప్పండి వారి గురించి... మనమా పండితులం కాదు.. తెలుగు లో ఆయన రాసిన వాటిని విశ్లేషించి విమర్శనాపూర్వకంగా రాయటానికి... 

ఒక్క నిమిషం... మన వేటూరి వారు రాసిన పాటలు అర్థం చేసుకోడానికి పాండిత్యం అవసరమా? కేవలం పండితులే అర్థం చేసుకోనేట్టు ఆయన రాసివుంటే మనకు ఆయన పేరే తెలిసివుండేది కాదు కదా...

వేటూరి వారికి నేను అభిమానిని అనిచేప్పటానికి నాకు ఒక్క కారణం చాలు...
మన తెలుగు లో అప్పటికీ... ఇప్పటికీ...ఇక ఎప్పటికీ.. మంచి స్పూర్తినిచ్చే పాట ఒకటే... దాని తరవాతే ఏదన్నా..


మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ

కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ


అడుగో అతడే వాల్మీకీ బ్రతుకు వేట అతనికీ

అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి

అడుగో అతడే వాల్మీకీ

పాల పిట్టల జంట వలపు తేనెల పంట

పండించుకుని పరవశించి పోయే వేళ

ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడూ

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగ

ఆ శోకం లో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే

కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా

మనిషి అతడిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు

నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం

ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడూ

అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడూ

అందుకే కృషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ....
.....

......
ఈ ఒక్క పాట తో నేను వేటూరి వారికి ఎప్పుడో అభిమానినైపోయాను... ఆ పాట ఎప్పుడు విన్నా ఏదో ఆవేశం..ఆహా ఎంత బాగా చెప్పారు.. ఒక మనిషిని కర్యోన్ముఖుడిని చేసేందుకు కావలసినంతా అందులో చాలా చక్కగా చెప్పారు.. మనిషి తలచుకొంటే సాధించలేనిది ఏమీ లేదు అని చాలా సామాన్యులు గా ఉండి తాము చేసిన పనులతో చరిత్ర లో చిరస్థాయిగా మిగిలిపోయిన వారిని ఉదహరిస్తూ..... 

నా ఉద్దేశం లో ఆ పాట తరువాత ఇంతవరకూ అంతటి పవర్ ఉన్న పాట మరీ రాలేదు...కాదంటారా..

ఏమిటా పవర్? ఏం మాట్లాడుతున్నావు.. ఒక పాటకే పవర్ ఉంటే మరి మనలో ఎంతో మంది చరిత్ర పురుషులు అయ్యి ఉండేవారుకదా?? అంటారా...

ఆ పాటకు ఖచ్చితంగా సరిపోయే మన నట సార్వభౌముడు లేడా.... కృషితో.. సంకల్ప భలంతో ఎక్కడో నిమ్మకూరులో పుట్టి ఇంటింటికీ పాలు పోసిన ఆయన నటనలో తనకు సాటి ఎవరు అని ప్రపంచాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగి... తనను అభిమానించిన తెలుగు వారి ఋణం తీర్చుకోవాలన్న ఆలోచనతో తాను నిర్మించుకొన్న నటనా శిఖరాలను విడిచి రాజకీయాలలోకి వచ్చి... శతాబ్ద కాల కరడుగట్టిన కాంగ్రెస్స్ వాదులను ఒక్క దెబ్బతో ఖంగు తినిపించి న ఆ మహానుభావుడి జీవితం... ఆ పాటకు సరిగ్గా సరిపోతుంది అనడానికి అనుమానమే లేదు..

కష్టపడి కీర్తి సంపాదించి ఆ స్వకష్టంతో వచ్చిన సంపాదనతో ఉన్నత శిఖరాలు చేరిన మన వాళ్ళు ఎందరో ఉన్నారు వారందరికీ వందనాలు..

అలా కష్టపడి తాను పైకివచ్చి మా అందరినీ ఈ స్థితికి తెచ్చిన మా నాన్న నాకు ఎప్పటికీ స్పూర్తే.....

కానీ యిప్పటి యువత అలా కష్ట పడి పైకివచ్చిన వారిని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారా? అదే నిజమైతే మరి అవినీతి లో కూరుకు పోయికూడా నాయకులుగా చలామని అవుతున్నారు..... వారి ధైర్యం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.. అలా అని అందరూ వారినే సమర్థిస్తున్నారని చెప్పటం నా ఉద్దేశం కాదు.. కానీ అలాంటి వారికి కనీసం ఒక్క ఓటన్నా ఎలా పడుతోంది అన్నదే నా ప్రశ్న...మనం ఆలోచించి ఓటేస్తే ఇప్పటి నాయకులకు ఎంత మందికి డిపాజిట్లైనా దక్కుతాయి అని ఒక లిస్టు వేస్తే అందులో నేటి నాయకులు ఎంత మంది ఉంటారు?

అసలు ఆలోచించి ఓటు వేసేవారు వున్నారా అని లిస్టు వేస్తే? అదేంటి కామెడీ ప్రశ్న? అందరూ అలోచించి గెలిచేవాడికే వోట్లు వేస్తున్నాము కదా అంటారా.....

ఈ మధ్య ఒక ఆర్గుమెంట్ లో అదే అన్నాడు ఒక చదువుకొన్న ఫ్రెండ్...గెలిచేవాడు ఎవరనా మనమాలోచిన్చాల్సిండేది.. సమర్థుడు ఎవరనా?... సమర్థుడు అంటె ఇక్కడ మంచి విధాన పరుడని.. మంచి విధాన పరుడంటే ప్రజలకు మంచి చేసే విధానాలను తెచ్చే వాడని నా అర్థం..
మరి మంచి విధాన పరుడుఎవరు అని మనం ఆలోచిస్తున్నామా? .. ఏంటి సత్య కాలం నాటి మాటలు...అంటారా..

ఏ కాలమైనా... నాకేంటి లాభం... నా కులం వాడా కదా.. నా కులపోడైతే ఒట్లేస్తాను... ఉచితంగా ఇస్తే ఒట్లేస్తాను.. గెలిచేవాడికే వోట్లేస్తాను ...అనుకోవడం ఏ రాజకీయ వ్యవస్థకూ ఆధారం కాకూడదు ... అదే జరుగుతూ పోతే మనం ఆధునికత నుంచి మరీ  Might was Right  అన్న అనాగరికత వైపు వెళ్లడం కాదా ....

అసలు గెలిచేవాడు అని ఓటువేసేముందే ఎలా అనుకొంటాం?..ఏ ప్రాతిపదిక మీద అలా అనుకొంటాం?...

ఏంటి రోయ్.. తెలుగు సినిమా పాట అని మొదలెట్టి ఎక్కడికో వెళుతున్నావు... స్వర్గం నరకం అని కామెడీలు రాసే వాడు......వీడికి దొబ్భింది రోయ్ .. ఏది.. తల టర్నింగ్ ఇచ్చుకో.. చిన్న మెదడేమన్నా చితికిందేమో చూద్దాం... అంటారా...

లైట్ తీస్కో గురూ.. చెప్పా కదా ఆ పాట విన్నప్పుడు ఏదో ఆవేశం అని... ఇప్పుడే విన్నా ఇంకోసారి.... అదీ విషయం..

అదే పాట స్ఫూర్తి తో.. నేనూ ఒక పాట రాసాను.. ఓపిక ఉంటే.. ఒక్కసారి....
............
మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బుర్ర
గుర్రు కొట్టి నిద్రపోతే అవుతుంది ఇల్లు గుళ్ళ.....

కుటిలంతో కొందరు నేతలవుతారు... మహా మేత లవుతారు...
తర తరాలకూ తరగని సిరులిస్తారు.. కులవేలుపులవుతారు...

అదుగో అతడో కులనేత, వోట్ల వేట అతనిది..
అతి భయంకరుడు యమకింకరుడు ఫాక్షనిష్టుల పాలిటి.....

కరువు మంటతో, పండని కలల పంట తో ఆర్థ నాదం చేయు వేళ...
ఆ అన్నదాత పై గురి పెట్టాడు...కారణం బాబు అన్నాడు
వోట్ల వర్షమే కురవగా ... ఫీఠం తనదే అవ్వగా ...
భూములన్నీ కాజేసి, అయిన వారికి ధార పోసి న ....
అ కులనేత మన వాడు....మనకోసం ఉన్నాడు..అని జనం విఘ్నత మరిచారు, మహానేతను చేసారు....

అందుకే
కుటిలంతో మనుషులు నేతలవుతారు... మహామహా మేత లవుతారు...
తర తరాలకూ తరగని సిరులిస్తారు.. కులవేలుపులవుతారు...
..........

ఇప్పుడు నిజంగానే వీడికి చిన్న మెదడు ఖచ్చితంగా  చితికింది అని నిర్ధారించు కున్నారు కదూ.....

ఒకే ఫ్రెండ్స్.. ఇందాక చెప్పినట్లు లైట్ తీసుకొని... వచ్చే ఉప ఎన్నికల్లో కూడా గెలిచేవాడికే మన ఓటు... అన్న మన ఆలోచనా సరళిలో ఏ మార్పూ లేకుండా అలా గడిపేద్దాం కాలం యిప్పటికి....

ఉంటా మరీ ఎప్పుడో కలుద్దాం, నా ఈ చితికిన చిన్న మెదడులో ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు.. మళ్ళీ మీ టైం కొంచం వేస్ట్ చేసేకి......

Tuesday, April 3, 2012

2050 స్వర్గం...న ర కం


2050 స్వర్గం...న  ర  కం

అది యమలోకం,  రోజంతా పాపులతో అలసి పోయి ఇక విశ్రాంతి తీసుకుందామని యముడు తన అంతరంగిక మందిరం వైపు వెళుతున్నాడు.. అలా వెళుతూ.... శిక్ష మధ్యలో కొంచం సేద తీరాలని పక్కనున్న బెంచీ మీద కూర్చున్న శేఖరం ని చూసి...

యమ: ఏమిటి శేఖరం ఎలావుంది ఇప్పుడు మీకు?

శేఖరం: నడుస్తోంది యమధర్మ రాజా, రోజుకు మూడు నూనె వేపుళ్ళు ఆరు రంపపు కోతలూ... వయసు పెద్దదయ్యింది. మీరు మరొక్క సారి కనికరించండి...

యమ: అదేమిటి, మీరు నాయకులని కనికరించి ఆ మధ్య శిక్షలు తగ్గించితిమి, మధ్య మధ్యలో ఇలా సేద తీరుటకు కూడా అనుమతి ఇచ్చాము కదా.. అంటూ యమధర్మరాజు ముందుకు కదిలాడు...

యములవారు ఎప్పుడో ఒకసారి కానీ ఈమాత్రం మాటలాడరు, దొరికిన అవకాశం వదులుకో దలచుకోలేదు మన శేఖరం..

శేఖరం: యమధర్మరాజా, ఏమి ఆలోచించారు నేను ఇదివరకు చెప్పిన విషయం?

యమ: ఏ విషయం?

శేఖరం: అదేనండీ, పెరిగిన పాపులతో మీరు పడుతున్న శ్రమ, దానికి విరుద్ధంగా ఇంద్రులవారు అనుభవిస్తున్న సుఖం..గురించి

యమ: విన్న యముడు, బెంచీ మీద కూర్చుంటూ ఆ గుర్తుకొచ్చింది, కానీ అది జరిగే విషయం గా లేదు, నేను ఇదివరకే ఇంద్రుడికి చెప్పితిని, ఆయన అంత సుముఖంగా ఉన్నట్టు లేదు, మీరు చెప్పిన మార్పులు చెయ్యటం అంత సులువు కాదు..పైగా పెద్దాయనకు తెలిస్తే...అంటూ ఉండగానే...

శేఖరం: మీరు మీ వైపు నుంచి సమ్మతం తెలపండి, మిగతా విషయాలు చక్కపెట్టడానికి మన వాళ్ళు ఉన్నారు కదా, ఇంద్రులవారితో ఒప్పించడం నాకొదిలేయ్యండి...

యమ: సరే కానీయండి, నా పని భారం తగ్గుతుంది అంటే అంతకన్నా కావలిసింది ఏముంది, శ్రీమతితో గడిపే సమయమే లేకుండా పోయింది...అంటూ లేచి చెవిలో ఇయర్ ఫోన్ సరిచేసుకొంటూ మన సెల్లు రాజా బహూకరించిన ఐపాడ్ లో పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో...పాట హమ్ చేసుకొంటూ మనసులో శ్రీమతిని ఉహించుకొంటూ హుషారుగా వెళుతున్న యమున్ని చూసి...

చేతిలో ఐపాడ్ పెట్టుకొని ఇంకా దేవదాసు కాలంనాటి పాటలు వింటూ ఇంత అమాయకంగా ఉన్నాడేంటి ఇతను, అయినా ఎదుటివాడి అమాయకత్వమే కదా మనకు కావలిసింది, ఆ అమాయకత్వాన్ని ఆయుధంగా వాడుకొని రాజ్యాలేలడం, అదే అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి కోట్లు దండుకోవడం మనకు బాగా తెలిసిన విద్యకదా అనుకొంటూ... 

ఇఫోన్ తీసి తన సహచరులైన సెల్లు రాజా, కన్ని కుట్టి, మాడీ కళ్ళు మరియూ ఇంకొంత మందికి సంక్షిప్త సందేశం(SMS) పంపాడు, వెంటనే అత్యవసర సమావేశంకు రమ్మని పిలుస్తూ...

****

అది యముని సమావేశ మందిరం, విధాన పరమైన మార్పులు చర్చించుటకు ఉపయోగిస్తూవుంటారు ఆ మందిరాన్ని.  ఆ మందిరం శిల్పకళావైభవం అంతా పురాతనవాస్తు శిల్ప నైపుణ్యం ఉట్టిపడుతూ ఉన్నా, గది అత్యంత అధునాతన సదుపాయాలను కలిగి ఉంటుంది..ఈ మధ్యనే నరకానికి వచ్చిన ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ సలహాలు, సూచనల మేరకు, వీడియో కాన్ఫరెన్స్, పేస్ టైం, సిరి వంటి సదుపాయాలతో ఆ మందిరాన్ని ఆధునీకరించారు. అందుకు ప్రతిఫలంగా అతను చేసిన చోరీ పాపాలు అన్నీ మాఫీ చేసి స్వర్గానికి పంపారు మన యముడు గారు.

శేఖరం, సెల్లు రాజా, కన్ని కుట్టి, మాడీ కళ్ళు మరికొంతమంది ఆసీనులయ్యి ఉన్నారు మందిరం లో..యముడు మరియు ఇంద్రుడి కోసం వేచి చూస్తున్నారు..

శేఖరం: ఏమిటి సెల్లు రాజా మనం వచ్చి ఇంత సేపయ్యింది యముడు, ఇంద్రుడు ఇంకా రారేంటి?

సెల్లు రాజా: అబ్బ ఎన్ని సార్లు చెప్పాలి శేఖరం, నా పేరు సెల్వ రాజా అని.. అంటూ విసుక్కొన్నాడు..

శేఖరం: అబ్బా! సరేలేవయ్య... నేను సెల్లు రాజా అనడం, నువ్వు సర్ది చెప్పడం మనకు మామూలేగా, ఇప్పుడు నాకు ఒకటే సంశయంగా, ఒకపక్క భయంగానూ ఉంది, యములవారు, ఇంద్రుడూ మన ప్రతిపాదనలు విని సానుకూలంగా స్పందిస్తారా లేదా అని..

కన్ని కుట్టి: అన్నే..ఇంద పారు....... అని చెప్ప బోతూంటే మన శేఖరం ఆమెని ఆపి

శేఖరం: ముందే నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో నీ అరవం ఏంటమ్మా తెలుగులో చెప్పు..అని విసుక్కొన్నాడు.

కన్ని కుట్టి: తెనుగు, కొంచం కొంచందా వచ్చును కదా.. అందుకని...అంటూ నసిగింది..

శేఖరం: సరే విషయం సొల్లు...

కన్ని కుట్టి: చూస్తిరా మీకు మా అరవం కొంచం కొంచందా వస్తూంది.. అంటూ నవ్వింది.

ఒకపక్క టెన్షన్ లో నేనుంటే ఈ అరవ గోలేంటి అనుకొంటూ అసహనంగా.. తన ఇఫోన్ తీసి, ఏమన్నా మేసేజులు ఉన్నాయేమో చూడసాగాడు..

మాడీ కళ్ళు:  ఏ క్యా హోరహా హై బై, ఇతనాదేర్ ఖ్యో...

వీడొకడు, యమ భటులు వీడితో రోజూ కబ్బడీ ఆడుకొంటున్నారు, ఏదో మనవాడే కదా, కొంచం విరామంగా వుంటుంది అని పిలిస్తే, అక్కడికి వీడికి ఏవో రాచకార్యాలు ఉన్నట్టు.....క్యాహోరహాహై?...హిందీ గోల..అని మన శేఖరం అనుకొంటూఉండగానే, యముండ అంటూ యముడు ప్రవేశించాడు.

ఆశీనులవుతున్న యములవారిని చూసి నవ్వుతూ...

శేఖరం: ఇంద్రుల వారు ఇంకా రాలేదు, మరి కొంత సేపు వేచి చూద్దామా స్వామీ...

యమ: ఆ శేఖరం, మరచితి... ఉదయాన్నే.. మన ఇంద్రులవారు సందేశం పంపారు...రాత్రి సురాపానం మోతాదు ఎక్కువయ్యిందట.. ఉదయాన్నే కొంచం తల పట్టేసి నట్టు ఉందట, అదే ఏదో అంటారుగా మీరు దాన్ని..

శేఖరం: హ్యాంగ్ ఓవరా.. స్వామీ!

యమ: ఆ.. అదే..సుఖం ఎక్కువై సమావేశాలను ఏదో సాకు చెప్పి ఎగ్గోట్టటం ఎక్కువయ్యింది వారికి ఈ మధ్య, నాకే చాకిరీ అంతా.... అంటూ...  ఉడుక్కొంటూఉండగానే..

శేఖరం: మరి ఇప్పుడెలా స్వామీ, ఇంద్రులవారు లేకుండా మనం ఈ మార్పులు ఎలా చర్చిస్తాము?

యమ: ఆ, అవసరం అనుకొంటే తను వీడియో కాన్ఫరెన్స్ లోమాట్లాడుతాను అన్నారు, లైను కలపండి...... అన్నాడు

శేఖరం: సెల్లు రాజా ఇంద్రుల వారిని లైనులో పెట్టండి.

సెల్లు రాజా: అబ్బ నా పేరు సెల్వ రాజా అంటూ.. లైను కలపడానికి లేచాడు..

శేఖరం: అదేలేవయ్య సెల్లు రాజా, ముందు తొందరగా ఇంద్రులవారిని కలుపు.....అంటూండగానే మన ఇంద్రులవారు లైన్లో కొచ్చారు..
ఇంద్రుల వారు తన హంసతూలికా తల్పం లో నిద్ర మొఖం తో ఒంటి మీద వస్త్రం లేదన్న విషయం కూడా గమనించకుండా ఉన్నాడు.. యిదంతా 100 ఇంచుల LED స్క్రీన్ లో చూసి మన వాళ్ళు సిగ్గుతో ముసి ముసిగానవ్వుతూ కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొన్నారు.. ఇది గమనించిన ఇంద్రుడికి తన అవతారం అర్థమయ్యి... సర్దుకొని....

ఇంద్రుడు: ఏమిటి యమా ఈ అత్యవసర సమావేశం?...... అన్నాడు

అత్యవసరమా... రెండురోజులయ్యింది సమావేశం గురించి సందేశం పంపి, ఈయన గారికి పని లేక పైత్యం ముదిరింది అనుకొంటూ యముడు..

యమ: అదే ఇంద్రా, నరకం లో పని వత్తిడి బాగా పెరిగింది, విశ్రాంతి, సంసార సుఖం కూడా లేకుండా ఉంది అందుకు మనం కొన్ని మార్పులు చెయ్య వలసిన అవసరం ఆసన్న మయ్యింది.

ఇంద్రుడు: తరతరాలుగా వున్న వాటిని మర్పుచేస్తే మనకు ఒరిగేదేమిటి యమా? అన్నాడు ఎక్కడ తన సుఖానికి ఎసరు వస్తుందో అని.
ఇంద్రుని మనసెరిగిన యముడు, విషయం బెడిసి కొట్టకుండా జాగ్రత్తగా..

యమ: ఆ చేసే మార్పు వల్ల మనకు పైకం బాగా ముట్టడమే కాక, ఇంకా ఎక్కువ సుఖం దక్కుతుంది ఇంద్రా
ఇప్పటి సుఖం తోనే తభిబ్బవుతున్న మన ఇంద్రుడు, ఇది విని..

ఇంద్రుడు: ఆ.. ఆ.. ఇంకా సుఖమా.. అదెలా?

యమ: మన మిత్రులు మంచి ప్రతిపాదనలతో వచ్చారు.. ఇంక మీరేమీ ఆలోచించకండి, అయినా మీ సుఖానికి ఏ లోటూ రాకుండా నేను ఉన్నాగా ఇంద్రా.. నా మీద నమ్మకం లేదా అంటూ.....ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగాడు.

ఇంద్రుడు: ఆ.. అలా అనికాదు, మరి పెద్దాయన కు తెలిస్తే కష్టం కదా?

యమ: విషయం పెద్దాయనకు తెలీయకుండా మేనేజ్ చెయ్యాలి, అందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి మన వాళ్లదగ్గిర.

ఇంద్రుడు: ఏమో చాలా జాగ్రత్త గా ఉండాలి, విషయం తెలిసి పెద్దాయన మూడు మారితే, ముళ్లోకాలూ మూసుకొని కూర్చోవాలి.

విషయం హైకమాండుకు తెలియ కుండా మేనేజ్ చెయ్యడం మనకు తెలిసిన విద్యల్లో ఒకటి, ఈయన ఉరికే కలవరపడుతున్నాడు అనుకొంటూ ఉన్నాడు మన శేఖరం మనసులో.

యమ: అది వారు చూసుకొంటారు, మరి మీకు సమ్మతమే కదా?

ఇంద్రుడు: సరే కానివ్వండి.. సుఖాలకు అలవాటు పడ్డాక, కాదనదేముంది..

ఇక అందరూ చెయ్యవలసిన మార్పుల గురించి చర్చించుకోవడం మొదలెట్టారు... చర్చలు చాలాసేపు కొనసాగాయి.

****

భూలోకం

అది హిమాలయా పర్వత ప్రాంతం, ఆధ్యాత్మికతకు ఆలవాలమైన ఆ ప్రాంతంలో నారాయణానంద స్వాములవారి ప్రశాంతమైన ఆశ్రమం, గత వంద సంవత్సరాలుగా నారాయణానంద స్వామి వారు తపస్సు చేసి వచ్చిన ఆథ్యాత్మిక జ్ఞానసంపదను తన శిష్యులకు పంచి ఇక ఇహలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్లి పరమాత్మలో ఐక్యం కావాలని తలంచి స్వచ్చందంగా తనువు చాలించారు.

****

యమలోక ముఖద్వారం

చాలా ప్రశాంతంగా ఉంది యమలోక పరిసర ప్రాంతమంతా...యమలోక ద్వారం ద్వారా లోనికి ప్రవేశిస్తున్న నారాయణానంద స్వామిని పరీక్షగా చూస్తూ ద్వారపాలకుడు, యమలోకానికి ఉత్త చేతులతో వస్తున్నాడు శాశ్వతంగా ఇక్కడే ఉంటాడా ఏంటి అనుకొంటూ... దారికి అడ్డం వచ్చి చెయ్యిచాస్తూ

ద్వార పాలకుడు: నాకేంటి...

స్వామికి విషయం అర్థంకాక అమాయకంగా అయోమయంగా అతన్ని అలా చూస్తూ, నాకేంటి అంటాడు ఏంటి అనుకొంటూ వుంటే.. ఇంతలో ద్వారపాలకుడే మరీ

ద్వా.పా: చేతిలో ఏమీ తేకుండా వచ్చావ్  నువ్వేమి ఇస్తావులే వెళ్ళు వెళ్ళు అన్నాడు జాలిగా చూస్తూ

స్వామివారు మరింత అయోమయంగా, ఏమీ తేకుండానా.... చనిపోయిన వాళ్ళు అలానే కదా వస్తారు అనుకొంటూండగా, ఒకతను ద్వారంలోనుంచి వెళుతూ ద్వారపాలకుడి చేతిలో కొంచం పైకం పెట్టి వెళ్లాడు, ద్వారపాలకుడి మొఖం వెలిగింది సంతోషంగా.
ఆ వెలుతూవున్న వాడు భుజం పైన ఒక చిన్నపాటి సంచితో వెళుతున్నాడు, అందులో ఏదో బరువైన వస్తువు వున్నట్టుంది.
స్వామివారికి ఏమీ అర్థం కాలేదు, అలానే లోపలికి నడిచారు.

యమసభ

యముడు తన సింహాసనంలో జారగిల కూర్చొని చేతిలో ఉన్న ఐపాడ్లో Angry Birds లేటెస్ట్ గేమ్ ఆడుతూ ఆనందిస్తున్నాడు... మధ్యలో చిత్రగుప్తులవారికీ చూపిస్తూ నవ్విస్తున్నాడు..

చిత్రగుప్తులవారు అలా నవ్వుతూ, లైనులో వస్తూవున్న పాపులను పలకరిస్తూ, అప్పుడప్పుడూ భవిష్యవాణి చూస్తూ వారివద్దనుండి ఏదో తీసుకొని వెళ్ళు వెళ్ళు అని చెయ్యి ఉపుతున్నాడు..

ఇంతలో ఒక పాపితో ఇలా....

చిత్రగుప్త: ఏమిటి, ఏమిటి నువ్వు ఇస్తున్నది, నీవు చేసిన పాపానికి నువ్వు నరకంనుంచి ఏ శిక్ష పడకుండా వెళ్ళాలంటే ఇది సరిపోదు, ఇంకా తీ.. లేదా ఒక వారం రోజులు నూనెలో వేగి ఆ తరవాత వెళ్ళు.. లెక్క సరిపోతుంది

పాపి: అయ్యా అట్లా అనమాకండి, ఏదో కుటుంబాన్ని పోషించుకోవడానికి అబద్ధం చెప్పి తెల్లకార్డు తెచ్చుకున్నా దానికే అంత శిక్షణా అయ్యా , దయచూపాలి మీరు

చిత్రగుప్త: ఎంటిరోయ్ చాలా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పాపివి, నీమీద దయచూపడమా, నీచిట్టా మొత్తం తీయమంటావా.... మరో మాట మాట్లాడితే.. ఒక సంవత్సరం పాటు ఇక్కడే నూనెలో వేగుతూ వుంటావు,...

ఈ గోలకు యమునికి కోపంవచ్చింది

యమ: యముండ...  ఏమిటి చిత్రగుప్తా అది,  ప్రశాంతంగా గేమ్స్ ఆడనీయకుండా..

చిత్రగుప్త: ఏమీలేదు ప్రభూ, వీడొక చిరు పాపి పైకంతో రాలేదు కానీ నన్నే ప్రశ్నించుచున్నాడు

యమ: ఆ...చిత్రగుప్తులను ప్రశ్నించడమంటే మమ్ములనే ప్రశ్నించినట్లు.. అంతేకాక మా ప్రశాంత వీక్షణానికి భంగం కలిగించినందుకు వీడికి పది కొరడా దెబ్బలు,పది రంపపు కోతలూ అదనంగా విధించండి... అని కోపంగా ఆజ్ఞ వేసారు యములవారు

పాపం చిరు పాపి....

యముడు అంతటితో చాలించి, చిత్రగుప్తులవారితో “Who will be the katravalli”  ధారావాహికం సతీసమేతంగా వీక్షించుటకు వేలయ్యిందని చెప్పి నిష్క్రమించాడు.

తరువాత పాపి వాలకం చూస్తేనే చాలా ధనవంతుడిలావున్నాడు

చిత్రగుప్తులవారు ఆ పాపి ఇచ్చిన అధునాతనమైన సెల్ ఫోన్ ను చూసి మురిసిపోతూ, ఒకసారి ఒరచూపుతో యముని సింహాసనం వైపు చూసి మనసులో.. హమ్మయ్య వెల్లాడుకదా చూసాడంటే వదలడు అనుకొంటూ తన పంచెలో ని రహస్య జేబులో అప్పటికే దాచుకున్న వాటితో కలిపి... ఈరోజు శ్రీమతికి పండగే అని ముసిముసి నవ్వు నవ్వుతూ వెళ్ళు వెళ్ళు అంటూ చెయ్యి ఊపాడు.

ఇదంతా చూస్తున్న మన స్వామికి మతి పోతోంది.. తను చూస్తున్నది నిజమేనా లేక భ్రమా....పాపులు పైకం సమర్పించి శిక్ష తప్పించుకొని వెళుతున్నారు.

ఇంతలో మన స్వామి వంతు వచ్చింది.

చిత్రగుప్తులవారు అలవాటుగా ఆ.. ఆ.. అంటూ చెయ్యిచాచారు మన స్వామి వంక చూడకుండా...

స్వామి ఏమీ మాటాడకుండా అలానే నిలపడ్డారు.

చిత్రగుప్తుల వారు చిరాకుగా తల ఎత్తి మన స్వామి వారి ముఖంలోని తేజస్సును చూసి తన భవిష్యవాణిలో విషయం గ్రహించి, స్వామీ క్షమించాలి, పనిలో పడి గమనించలేదు. 

మీరు పరధ్యానంలో ఉన్నప్పుడు  మీ కాలు తాకినందువల్ల చీమకు కలిగిన కష్టానికి మిమ్ములను నరకానికి రప్పించడం జరిగింది, మీ తపోబలానికి మీకు నరకలోక దర్శనంకన్నా ఎక్కువ శిక్ష విధించడం మాతరం కాదు, మీరు ఇక దయచేయ్యండి అంటూ నమస్కరించాడు.  

చిత్రగుప్తుల వారి వద్ద సెలవు తీసుకొని స్వర్గానికి పయనం అయ్యాడు మన స్వామి వారు.

ద్వారంవైపు వస్తూన్న స్వామివారిని చూస్తూ ఏమిటి ఇతను ఉత్త చేతులతో వచ్చి ఏ శిక్షా పడకుండా పోతున్నాడు, అంత పుణ్యాత్ముడా, లేక చిత్రగుప్తులవారిని బాగా మోసేసాడా... అనుకొంటూండగా స్వామివారు ద్వారపాలకుని భుజమ్మీద చెయ్యి వేసి ఇలా అన్నారు

స్వామి: ఏంటికథ అందరూ మూటలతో వస్తున్నారు పైకం ఇచ్చి శిక్ష తప్పించుకొని వెలుతున్నారు, కొంతమందికి శిక్ష విధిస్తున్నారు కానీ నామమాత్రంగానే ఉంది, కొంచం అర్థం అయ్యేట్లు చెప్పు ఏమి జరుగుతోందో

ద్వా.పా: ఏంటి ఏమీ సంపాధించుకోలేదా ఉత్త చేతులతో వచ్చావు?

స్వామి: అదేంటి పుట్టినప్పుడు ఏమీ తీసుకోనిరాము అలాగే, ఎంత సంపాదించినా చనిపోయిన తరువాత ఏమీ తీసుకుపోము కదా!

ద్వా.పా: ఉట్టి అమాయకుడిలా ఉన్నావే, ఎపుడో సత్యకాలం నాటి మాటలు చెబుతున్నావ్, ఇప్పుడంతా మారిపోయింది. మనుషులు బతికున్నపుడు వారికి, వారి తరవాత తరాలకు సరిపడినంతే కాకుండా, చనిపోయాక కూడా అనుభవించేందుకు మస్తుగా సంపాదిస్తూవున్నారు, భూలోకంలో ఉండి ఏమిచేస్తున్నవయ్యా డబ్బు సంపాధించుకోకుండా...

స్వామి: చనిపోయిన తరవాత సంపాదించినది ఎలా తెచ్చుకుంటారు?

ద్వా.పా: ఓరి అమాయకుడా, ఇది కూడా తెలుసుకోకుండా ఎలా ఉన్నావయ్య భూలోకంలో... ఇప్పుడు చనిపోయిన వాడితో వాడి సంపద కూడా పాతిపెడుతున్నారు కదా, యమభటులకు, శక్తి కొద్దీ సమర్పించుకుంటే వాళ్ళే తెస్తారు మొత్తం ఇక్కడికి

ద్వా.పా: ఇప్పుడు ఏలోకంలోనైనా సంపద ఉన్న వాడిదే కాలం, ఆ సంపద ఎలావచ్చిందో ఎవరికీ అవసరం లేదు, యువతకు కూడా సంపాదన ఒకటే ధ్యేయం...

స్వామివారికి ఇప్పుడే కొంచం కొంచం అర్థమవుతోంది ఏమిజరుగుతోందో.. ద్వారపాలకుడి వద్ద సెలవు తీసుకొని ఇంద్రలోకం వైపు దారి తీసారు.

ఇంద్రలోకం

స్వర్గం సమీపిస్తూండగా, కిటకిటలాడుతూ మూడు పెద్ద వరుసలలో మానవులు లోనికి వెలుతూఉండటం చూసారు స్వామివారు,
ఒక వరస వద్దకి వచ్చి ఏమిజరుగుతోందో గమనించసాగారు,  వరుస చివరన బల్ల వేసుకొని కూర్చొని ఒక్కొక్కడినీ విచారించి లోనికి పంపుతున్నాడు ద్వారపాలకుడు..

ద్వా.పా: ఎంత

మానవుడు: పది కోట్లు

ద్వారపాలకుడు ఒక పత్రంలో 5 అని వ్రాసి ఇచ్చాడు, మానవుడు దాన్ని తీసుకొని సంతోషంగా లోపలికి వెళ్ళాడు

ద్వా.పా: ఎంత

మానవుడు: మూడు లక్షలు సామి

ద్వారపాలకుడికి చిర్రెత్తుకొచ్చింది వింటూనే, ఆ మానవున్ని పక్కకు లాగి,

ద్వా.పా:  అక్కడ అంత పెద్దగా బోర్డ్ పెట్టాముకదా చదవలేదా, ఇది పది నుంచి వంద కోట్ల లైను.. పో ఆ మూడో లైన్లో కి వెళ్ళు.. మూడులక్షలతో స్వర్గం కావాల్సి వచ్చింది...వీణ్ణి కాదు ఆ చిత్రగుప్తులవారిని అనాలి, పైకం తీసుకొని అందరినీ స్వర్గానికి తోసేస్తున్నాడు...అని గొణుగుకుంటూ, చిరాకుగా తరవాతి మానవుని వైపు చూస్తూ....

ద్వా.పా: ఎంత

మానవుడు: 15 కోట్లు

ద్వారపాలకుడు పత్రంలో 5 సంఖ్య రాసి ఇస్తూవుంటే ఆ మానవుడు కొంచం పైకం ద్వారపాలకుడి చేతిలో పెట్టాడు, ద్వారపాలకుడు ఆ మానవున్ని చూసి పత్రం లో 5 ను 4 చేసాడు.. మానవుడు తృప్తి చెందలేదు ద్వారపాలకుడు ఇంతే అన్నట్టు చూసాడు, మరీ బలవంతం చేస్తే అది కూడా వుండదు అని ఆ మానవుడు లోపలికి కదిలాడు అసంతృప్తిగానే.

స్వామివారు మొదటి వరస దగ్గరికి వచ్చారు, అందరూ చాలా ధనవంతులని వారి వాలకమే చెబుతోంది.

ఇంతలో అదే వరస లో ఒకడు, వాలకం చూస్తే ఏమీ లేని కూలీపని వాడిలా వున్నాడు, ఆ వరుసలో మిగతా వారికి, వాడికి పోలికే లేదు

ద్వా.పా: ఎంత

మానవుడు: నూటయాభై స్వామీ..

ద్వా.పా: ఏంటి రూపాయలా... అన్నాడు కోపంగా వాడి అవతారం చూస్తూ

మానవుడు: ఆ... కోట్లు, నూటయాభై కోట్లు సామీ..

ద్వా.పా: నోరు వెళ్ళబెట్టి, నువ్వేంది నీ అవతారమేంది, వేలాకోలమా ... అన్నాడు కోపంగా

మానవుడు: ఇందులో వేళాకోలమేంటి సామీ, ఇదిగో చోసుకోండి అంటూ తన భుజమ్మీది సంచి తీసి చూపించాడు

ద్వా.పా: అది చూసి నమ్మశక్యంగా లేక, ఎలారా, ఎక్కడ పట్టావు ఇంత సొమ్ము

మానవుడు: నేను లిక్కర్ అమాత్యుల వారి ఇంట్లో పనిమనిషినండి, అంతే కాదండి నేను వారి బినామీ నండి

ద్వా.పా: అర్థం అయ్యింది, అదృష్టవంతుడివి వెళ్ళు వెళ్ళు.....అంటూ పత్రం మీద 1 సంఖ్య రాసి ఇచ్చాడు..

ఇక్కడ జరుగుతున్న తంతు చూసి, సంగతి అర్థం చేసుకొని మన స్వామివారు ఎలాగోలా లోపలికి వెళ్ళారు.

మానవులు తాము తెచ్చిన సంపదను జమా చేసి, మరో ద్వారం గుండా లోపలికి వెలుతున్నారు.. ద్వారపాలకుడు ఇచ్చ్చిన పత్రాలు చేతిలో పట్టుకొని

లోపల పెద్ద లాబీ లాంటి విశాల మైన గది, బంగారు రేకులతో అలంకరించిన స్థంబాల చుట్టూ అప్సరసల శిల్పాలు, వాటినాదారంగా వున్న పైకప్పు పైన బంగారు తాపడం చేసిన సుందర తైలవర్ణ చిత్రాలు, అదో అద్భుత ప్రపంచంలా ఉంది.

ఆ గది నుంచి 6 పెద్ద గదులకు దారి, ఆ గదుల ద్వారాలు మూసి వున్నాయి, అంతా మన అధునాతన మల్తీప్లెక్ష్సు ను తలపిస్తోంది.

మన స్వామివారికి స్వర్గం ఇలా ఉంటుందా అని ఒకింత ఆశ్చర్యంగా ఉంది.

ప్రతీ గది ద్వారం వద్ద ఒకడు మానవుల చేతిలోని పత్రాలలోని సంఖ్యను గది ముఖద్వారంమీద వున్న సంఖ్యతో సరిచూసుకొని లోనికి అనుమతిస్తున్నాడు.

లోపలికి అనుమతిస్తూవున్నప్పుడు ద్వారం తెరవగానే ఏదో సంగీతం, మనుషుల గోల వినపడుతోంది.

ఒకటవ ద్వారం కొంచం తెరుచుకోగానే లోపలినుంచి .. “రింగ రింగా.. రింగ రింగా..రింగ రింగా.. రింగ రింగా.. రే “ అంటూ ఒక అప్సరస నాట్యం చేస్తూ కనిపించింది

రెండవ ద్వారం తెరుచుకున్నప్పుడు లోపలినుంచి “ఇప్పటికింకా నావయసు నిండా పదహారే ...” అంటూ ఒక అప్సరస నాట్యం చేస్తూ కనిపించింది

ఒక్కొక్క ద్వారం చూస్తూ వెళుతున్న స్వామివారికి చివరన మరో మార్గం కనిపించింది, ఆమార్గం గుండా మరో అతిపెద్ద గది లోనికి ప్రవేశించారు, అది ఇంతకు ముందు దాని కన్నా రెట్టించిన అందంతో ఉంది, అంతా అప్సరసల విగ్రహాలే, గోడలన్నీ బంగారు తాపడాలే, గది ద్వారంలోనుంచి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న స్వామిని ద్వారపాలకుడు ఆపి...

ద్వా.పా: పత్రం ఎక్కడ?

స్వామి: పత్రం లేదు.

ద్వా.పా: పత్రం లేదా మరీ ఎలా వెళదాం అనుకోన్నావు, ఈ గది ఎవరికో తెలుసా?

స్వామి: తెలియదు అని అమాయకంగా మొఖం పెట్టాడు

ద్వా.పా: ఈ గది సామాన్యులకు కాదు, ఈ గదిలోకి వెళ్ళాలంటే కనీసం రెండు వేల కోట్లన్నా తేవాలి, ఇక్కడ అంతా పెద్ద పెద్ద వాళ్ళు వుంటారు

స్వామి: పెద్ద వాళ్ళంటే గాంధీ మహాత్ముడు, మదర్ తెరెసా లాంటివారా?

ద్వా.పా: పెద్దగా నవ్వి,  నువ్వు చెప్పినవారంతా ఆ పాత స్వర్గం లో వుంటారు భజన చేసుకొంటూ.. అయినా వాళ్ళ దగ్గిర అంత సంపద ఎక్కడుందీ?

స్వామి: మరి ఎలాంటి వారు ఉంటారు ఇక్కడ?

ద్వా.పా: ఇక్కడ 2జి స్పెక్ట్రం వాళ్ళు, దేశ రక్షణ పణంగా  పెట్టి సంపాధించినవాళ్ళు, భూములు కావలసినవారికి దోచిపెట్టేవాళ్ళు, దేశ పరువు పణంగాపెట్టి క్రీడల్లో డబ్బు సంపాధించే వాళ్ళు ఉంటారిక్కడ, అలాంటివారే అంత సంపద తీసుకొని రాగలరు..

ఇంకో విషయం, ఇక్కడి పాత పద్దతులన్నీ వీళ్ళే మా ఇంద్రులవారిని యమధర్మరాజును ఒప్పించి మార్పించారు.. దానివల్ల వారికి చాలానే ముట్టింది అని ఒక పుకారు వుందిలే స్వర్గం లోనూ నరకంలోను.
అంటూ ఇంకా ఏదో రహస్యంగా చెప్పాలని స్వామి చెవి దగ్గిరకు వచ్చి చిన్నగా

ద్వా.పా: ఈ మధ్యనే తెలిసింది, ఇంకా ఫైరవీలు జరుగుతున్నాయంట, ఇక్కడ అంతా అనుభవించి మరో జన్మలో, పుట్టేటప్పుడే సంపదతో పుట్టాలని వీరి ఆలోచన అంట.. ఏమో మరి చూడాలి ఏమిజరుగుతుందో...


వింటున్న స్వామి సంగతంతా గ్రహించి, ఇక ఇక్కడ ఉండడం అనవసరం అని తలచి, తక్షణ కర్తవ్యం బోధపడి వైకుంఠం వైపు అడుగులు వేసారు...