Sunday, June 17, 2012

నాన్నా..... నువ్వే మా కెప్టన్.


ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను... చాలా టచ్చింగ్ గా ఉంటుంది.
ఫాదర్స్ డే సందర్భంగా అందరికోసం మరొక్క సారి.....
My promise to my children - as long as I live I am your parent 1st, your friend 2nd.

I will stalk you, flip out on you, lecture you, drive you insane, be your worst nightmare and hunt you down like a bloodhound when needed because I LOVE YOU!

When you understand that I will know you are a responsible adult. You will NEVER find someone who loves, prays, cares & worries about you more than I do! If you don’t hate me once in your life – I am not doing my job properly.

చదువుతున్న ప్రతీసారి ఎంత నిజముంది అందులో...ప్రతీ నాన్నా అలాగే  ఉంటారా... అనిపించింది నాకు.
మా నాన్న మాత్రం నాకు అలాగే అనిపిస్తారు.

అవును...నేను ఆయనను హేట్ చేసాను.. ఒక్క సారి కాదు చాల సార్లు... సైకిల్ కొనివ్వలేదని, ప్యాంటు కాకుండా నిక్కర్లు కుట్టించారని, పైసలు సరిపడా ఇవ్వలేదని... అదనీ...ఇదనీ...ఇంకేదో అని..... పిల్ల తనం, మూర్ఖత్వం, అమాయకత్వం, మొండితనం ఏదన్నా కావచ్చు....

కానీ నేను ఇప్పుడు ఉన్న స్థితికి మా నాన్నే కారణం, ఆయన ఆ రోజు అలా ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఇలాఉన్నాను, ఆయన అలా కాక విచ్చల విడితనంగా అడిగినదంతా ఇచ్చి ఉంటే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో చెప్పలేను కానీ ఈస్తితికి మాత్రం వచ్చిఉండేవాడిని కాదు అనిమాత్రం ఘంటాపథంగా చెప్పగలను.

 నా డిగ్రీ తరవాతే మా నాన్న ఎంత కరెక్టో తెలిసి రావడం మొదలయ్యింది.

డిగ్రీ అయినతర్వాత హైదరాబాద్ లో గాంధీ నగర్లో ఫ్రెండ్స్ తో పాటు రూంలో ఉండి సివిల్ సర్వీసెస్ కు(UPSC) చదివే వాడిని, నా మొదటి ప్రయత్నం లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను... ఎమి చేస్తాం మన రైటింగ్ బాడ్, మెయిన్స్ లో అదే దెబ్బ కొట్టింది.... కానీ ఇప్పటికీ నేను గర్వ పడే విషయం అది, ఎందుకంటె ప్రతీ ఏడు దేశం మొత్తం కేవలం పదివేలమంది ప్రిలిమ్స్ క్లియర్ చేసేవారు అప్పట్లో, ఉన్న నాలుగు ప్రయత్నాలూ ముగించుకొని ఒక్క సారి కూడా కేవలం ప్రిలిమ్స్ పాస్ కాకుండా పెట్ట సర్దుకొని ఊరు వెళ్ళే వాళ్ళు ఎంత మందో ప్రతీ సంవత్సరం నాకు తెలుసు. నా రెండవ ప్రయత్నం లోనూ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ మళ్ళీ దెబ్బ పడింది..... నా ప్రిలిమ్స్ పాస్ కావడంలో మా నాన్న పాత్ర ఉంది, ఏంటంటే ప్రిలిమ్స్ లో నా సబ్జెక్టు హిస్టరీ నా మొత్తం ప్రీపరషన్ దాని మీదే, రోజుకు పద్దెనిమిది నుండీ ఇరవై ఘంటలు చదివేవాడిని అంటే కొంతమంది నమ్మక పోవచ్చు కానీ అదినిజం, కానీ నేను నా జనరల్ నాలెడ్జ్ పేపర్ కు అంత శ్రమ పెట్టలేదు అసలు శ్రమే పెట్టలేదు అంటేనే కరెక్ట్, కారణం ఏంటంటే నా పదవ తరగతి నుంచే మా నాన్న మాకోసం రెగ్యులర్ గా competition success తెప్పించే వారు నేను నా క్లాసు పుస్తకాలు చదవక పోయినా competition success మాత్రం రెగ్యులర్ గా చదివే వాడిని, అది మానాన్న నా ప్రిలిమ్స్ సక్సెస్ లో నిర్వహించిన పాత్ర.

మెయిన్స్ మళ్ళీ దెబ్బ పడింది అన్నా కదా, ఆప్పుడు తెలిసింది మా నాన్న ఎంత కరెక్ట్ రా అని, నా చిన్నప్పుడు మా నాన్న పదే పదే ఒక విషయం చెప్పే వారు ఏమిటంటే, చదవండి రా చదువే మీకు రేపు అన్నం పెట్టేది, మీరు పెద్ద అయ్యాక మరీ చదవాలంటే మరీ చిన్న వాళ్ళు కాలేరు కాబట్టి ఇప్పుడే బాగా చదవండి అని..... అది ఆయన తన అనుభవంతో చెప్పిన మాట.....నా చదువంతా అత్తెసరు మార్కులతోనే గడిచింది నేను ఎప్పుడూ ఖంటస్తం కొట్టింది లేదు ఇంత వరకూ ఏ విషయం, అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినది రాసేవాడిని, స్కూల్లో ఎప్పుడూ ఒకటే గొడవ, నీ సొంత కవిత్వం ఎందుకు రా పుస్తకం లో ఉన్నది రాయలేవా అని.....సరే వదిలెయ్యండి మన విద్యా విధానం గురించి విపులంగా తారవాత మాట్లాడుదాము, ఇక్కడ నేను చెప్పేదేమంటే నేను నా మెయిన్స్ లో రెండు సార్లు ఫెయిల్ అయ్యినప్పుడు అదీ కేవలం నా రైటింగ్ వల్ల..... చిన్నప్పటినుంచి మనం చెయ్యలేదు అది ఇప్పటికిప్పుడు రావాలంటే ఎక్కడినుంచి వస్తుంది.... నాన్న ఎంత కరెక్ట్ రా..... ఇప్పుడు మనం మరీ చిన్న వాళ్ళమై పోయి అప్పుడు చదవని చదువంతా చదవలేము కదా..... అప్పుడే నాన్న మాట విని ఉంటే అని ఎన్ని సార్లు అనుకోనిఉంటానో యిప్పటికీ.

సరే ఆ తరవాత మరొక్క ప్రయత్నం చేసి ఇక మనకు ఓపిక లేదు అని(ఒక సారి రాయాలి అంటే ఒక సంవత్సరం ఆగాలి), మా నాన్నను ఒప్పించి సాఫ్ట్ వేర్ కోర్స్ లో చేరి అక్కడ కూడా మొదటి ప్రయత్నం లోనే జాబు కొట్టి ఇదిగో ఇలా అమెరికాలో పడ్డాను.

సాఫ్ట్ వేర్ కు షిఫ్ట్ కావడానికి ముఖ్య కారణం, అప్పటికే మా నాన్నా రిటైర్ అయ్యారు, ఇక ఇంకా వారికి భారంగా ఉండ కూడదన్న కారణమే నన్ను ఆ వైపు నడిపించింది. అందుకు ఆయన జీవితమే నాకు స్పూర్తి, ప్పటికీ.....ఎప్పటికీ....
****
మా నాన్న పదకొండు మంది సంతానం లో అగ్రజుడు, మా తాత బ్రిటీషు వారి హయాములో ఒక పోలీసు కానిస్టేబుల్. అనంతపురం లో పాత పోలీసు క్వార్టర్స్ లో ఉండే వారు, మా నాన్న నన్ను ఒక సారి పోలీస్ లైన్స్ లో తాము ఉన్న ఇల్లు చూపించారు(అప్పటికి అవి శిథిలావస్తలో ఉండేవి), నాకు ఆశ్చర్యం వేసింది అంత చిన్న గదిలో అంత మంది ఎలా ఉండేవారో అని, పోలీస్ లైన్ స్కూల్ లో మరియూ గోవర్నమేంట్ హై స్కూల్ లో చదివి, పదవ తరగతికే టైపు హయ్యర్, షార్ట్ హండు చేసిన ఆయన ఇంటికి ఆర్థికంగా సహాయంగా ఉంటుందని అనంతపురం కోర్ట్ లో టైపిస్టుగా పనిచేస్తూ చదువుకొన్నారు. అలానే అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ పూర్తీ చేసారు ఆయన. చదువే ధ్యేయంగా ఆయన ఆ కాలేజీ లో చదివితే అదే కాలేజీ లో మనం అల్లరే ధ్యేయంగా గడిపాము మూడు సంవత్సరాలు....

ఇప్పటికీ బాగా గుర్తు ఆయన తన చిన్న తనం లో గడిపిన జీవితం, సంఘటనలూ అప్పుడప్పుడూ చెప్పేవారు, నా ఆలోచనా సరళి లో దాని ప్రభావం చాలా......

వేర్ హౌస్ కార్పోరేషన్ లో(Warehousing Corporation) సికిందరాబాద్ రీజినల్ మానేజరుగా రిటైర్ అయ్యారు ఆయన....తాతల ఆస్తులు లేవు కానీ ఆయన సక్సెస్ లో నేను చూసినది నిబద్దత, పట్టుదల, విషయ పరిజ్ఞానం....

ఆస్తులు అంతస్తులు అవసరం లేదు..... ఆయన చేతల ద్వారా ఆయన జీవితం ద్వారా నేను నేర్చుకున్నది, జీవితం లో డబ్బు కాదు ప్రధానం, ఏదన్నా సాధించడానికి ధృఢసంకల్పం ముఖ్యం....


నా జీవితానికి దిశ, దశ లను నిర్దేశించిన కెప్టెన్......
నాకు ఎన్ని జన్మలు ఉన్నా మీరే నా నాన్న.....

 ***** 

(కాప్టెన్, అని ఎందుకన్నానంటే... వేర్ హౌస్ మేనేజర్ కాక ముందు ఆయన ఆర్మీ లో కెప్టెన్ గా ట్రైనింగ్ పొందారు. ఇప్పటికీ అనంతపురం లో అయన పాత స్నేహితులు ఆయనను కాప్టెన్ శ్రీరాములు అనే పిలుస్తారు)

(సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో నా సక్సెస్ కు నా మిత్రుడు రాజు సహాయం ఎప్పటికీ మరువలేనిది, నేను చదివిన హిస్టరీ పుస్తకాలన్నీ రాజు పుస్తకాలే)

Saturday, June 2, 2012

వైద్యో..... నా....రా....య....ణ!


చిన్నప్పుడు సూది మందంటే భయం ఉండేది కానీ ఎప్పుడూ డాక్టర్ అంటే భయం ఉండేది కాదు... ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది...

అప్పట్లో డాక్టర్ అంటే ఎంతో గౌరవ భావం మనసులో ఆటోమాటిక్ గా ఉండేది, డాక్టర్ను చూడంగానే ఆ గౌరవంతోనే  రెండు చేతులతో నమస్కరించేవారం.....

కానీ ఇప్పుడు జ్వరమో ఇంకేదో వస్తే ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళదామని రోడ్డు మీద వెళుతూ కనిపించే క్లీనిక్ బోర్డు చూసి, ఏమి డాక్టరో ఏమో.... ఎమిచూస్తాడో... ఎంత గుంజుతాడో....యిలాగే కదా మన ఆలోచనలు ఉంటాయి

భయమేస్తోంది... వైద్యం అనుకొంటే భయం వేస్తోంది... రాబోయే తరాలను తలచుకొంటే జాలేస్తోంది.....

ఎందుకు? వైద్యం చాలా ఖర్చు అయిన వ్యవహారంగా మారుతోందనా? లేక మన వైద్యుల వైద్యం మీద నమ్మకం లేక నా?

రెండూ.

డాక్టర్లు అందరూ అంతే అని చెప్పడం నా ఉద్దేశం కాదు, డాక్టర్ వృత్తి మీద అపార గౌరవం అలానే ఉంది ఇంకా, కానీ కొంత మంది డాక్టర్లు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ఆ వృత్తికి అగౌరవాన్ని తెచ్చిపెడుతోంది.
*****

1979 అప్పుడు నేను నాలుగవ తరగతి, అనంతపురం చర్చి స్కూల్..... మన కోతి పనులకు గుర్తుగా ఉంటుంది అని మా తరగతి గది వెంటిలేటర్ ఎక్కి పడి ఎడమ చెయ్యి విరగోట్టుకున్నా.  ఆ రోజు రాత్రి వెంకటాద్రి ట్రైన్ లో రిజర్వేషన్ లేక జనరల్ కంపార్టుమెంటులో కిక్కిరిసిన జనంలో మా శంకర్ బాబు బాబాయ్ తో హైదరాబాద్ వెళ్ళాం. గాంధీ హాస్పిటల్ లో, ఎముకల డిపార్టుమెంటు హెడ్డు డాక్టర్ వెంకటరమణప్ప దగ్గిర కట్టు కట్టించుకొని మూడు నెలలు హైదరాబాద్ లోనే బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చా. నాలగవ తరగతి పెద్ద పరీక్షలు ఎగొట్టినా, చెయ్యి విరిగింది అన్న జాలితో మా టీచర్లు ఐదవతరగతికి పంపించారు, పంపించారు అనేకంటే తోసేశారు అంటే కరెక్ట్ (అప్పుడంతా కాస్ పాస్ కదా).
1981 ఆరవ తరగతి పెద్ద పరీక్షలు అయిపోయాయి ఆ ముందు రోజే... సైకిల్ నేర్పించు అని మా అన్నను ఎన్ని సార్లు అడిగినా పోరా అనేవాడు పెద్ద ఫోసు కొడుతూ తనకే సైకిల్ తొక్కడం వచ్చని, సరే మనమే నేర్చుకొందామని ట్రై చేశా ఫలితం కుడి చెయ్యి విరిగింది.. చెయైతే విరిగింది కానీ సైకిల్ అయితే నేనే సొంతంగా నేర్చుకున్నా అని కాలర్ ఎగరేసి చెప్తా...ఫాదర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి మల్లీ మా శంకర్ బాబు బాబాయ్ ని వెంట పెట్టి హైదరాబాద్ పంపించాడు. ఈసారి కూడా డాక్టర్ వెంకటరమణప్ప చేత్తో కట్టు కట్టించుకొని వేసవి సెలవలు హైదరాబాద్ లో గడిపి, ఏడో తరగతి ప్రారంభానికంతా అనంతపురం లో ప్రత్యక్షమయ్యి మరొక్క సారి మా స్కూల్ లో  మన ఘనత చాటా.

ఎందుకీ చరిత్ర అంతా అంటే... పై రెండు సంఘటనలలో నా డాక్టర్ వెంకటరమణప్ప గారు, ఆయనది మా అనంతపురం, ఆయన ఎంత సేవా తత్పరత కలవారంటే, రిటైర్ అయ్యాక అనంతపురం లో సమతా గ్రామం అని ప్రజా వైద్యశాల నెలకొల్పి, చాల తక్కువ ఖర్చు కే వైద్య సేవలు అందించారు...

అంతటి సేవా భావం ఎంత మంది వైద్యులకు వుందో మరి యిప్పుడు....

1991 నా బాచిలర్ డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజీ లో అయ్యిన తరవాత హైదరాబాద్ కు తరలి రావడం, 1993 లో మా నాన్న కు కూడా సికిందరాబాద్ ట్రాన్స్ఫర్ కావడం తో మొత్తం ఫామిలీ తరలి రావడం జరిగింది... అప్పుడు మేము కుటుంభం లో ఎవరికి ఏ సుస్తి చేసినా ఒక డాక్టర్ వద్దకు వెళ్ళే వారము, ఆయన మాకు మా బాబాయ్ ద్వారా పరిచయం.. సీతాఫల్మండీ లో ఒక షాప్ లో ఉండేది అతని క్లీనిక్.. అప్పట్లో బాగా చూసేవారు... ఒక దశాభ్ధంన్నర పాటు ఆయనే మా ఆస్థాన వైద్యుడు.

డాక్టర్ ఫీజు పెరుగుతూ వచ్చింది, అది మామూలే...పెరిగిన ఫీజు లాగే షాప్ క్లీనిక్ నుంచి ఒక నాలుగంతస్తుల మేడ లో సీతాఫల్మండీ మెయిన్ సర్కిల్ లో సొంత హాస్పిటల్ ఓపెన్ చేసే స్తాయికి ఎదిగారు మా ఆస్థాన వైధ్యులవారు..మంచిదే మాకూ గొప్పే... ఈలోపు నేను 2000 లో హైదరాబాద్ విడిచి చెన్నై వెళ్లడం అక్కడినుంచి అమెరికా వెళ్లిపోవడం జరిగాయి, మా వాల్లు అదే డాక్టర్ ను కొనసాగించడం జరిగింది... ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా మా నాన్నకొ, మా అమ్మకో జ్వరమో జలుబో వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళారా అంటే, ఎందుకురా వెళితే రెండు నుంచి మూడు వేలు అవుతున్నాయి అనేవారు, అదేమిటి అంటే మా డాక్టర్ ఫీజే కాదు ఆయన రాసియిచ్చే మందుల ఖరీదు కూడా విపరీతంగా పెరిగాయి అని అర్థం అయ్యింది..

2005 లో నేను హైదరాబాద్ కు వెల్లినప్పుడు మా డాక్టర్ వద్దకు వెళితే అర్థం అయ్యింది ఆయన ఎంత డబ్బు వైద్యుడైయ్యాడో... నాకు ఎమి తిన్నా కడుపులో మంటగా ఉంటోందని వెళితే ఆయన రాసిచ్చిన మందుల ఖరీదు మూడువేలు దాటింది.. మందుల షాప్ వాడిని ఎందుకింత ఖరీదు ఈ మందులు అని అడిగాను... ఆ మందుల షాప్ అతను చెప్పాడు ఈయన రాసే మందులు అంతే అనీ, అవిఅన్నీ ఆయన భాగస్వామ్యంలో ఉన్న కంపనీ లో తయారైన మందులే రాస్తారు, అవసరం లేకున్న కొన్ని విటమిన్ మందులు కూడా రాస్తారు అందుకే మీకు బిల్ ఎక్కువ అవుతుంది అన్నాడు.. అప్పుడే చెప్పా మా నాన్న తో, ఇక మీరు డాక్టర్ ను మార్చండి అని.... దానికి మా నాన్న సమాధానం.....”ఎక్కడ రా పద్మారావు నగర్ అంతా వెతికినా మంచి ఫిజీషియన్ లేడు, మనకు తెలిసినది యీయనోక్కడే” అని...... దేవుని దయ వల్ల ఈమధ్యే వేరే మంచి డాక్టర్ దొరికాడు మరీ మా వాళ్లకు.....
 *****
ఒకతరం డాక్టర్, ఆ తరవాత తరం డాక్టర్ లో ఇంత మార్పు చూసిన నాకు ఈమధ్య ఇండియా వచ్చినప్పడు ఎదురైన అనుభవాలు చెపుతాను వినండి.... చదవండి...

2011 లో నేను చెన్నై కేలంబాక్కం లో నాలుగు నెలలు ఉండాల్సి వచ్చింది, కేలంబాక్కం ఇప్పుడిప్పుడే అభివృది చెందుతోంది, OMR సిరుసేరి IT కేంద్రంగా మారిపోవడంతో, ఇప్పుడిప్పుడే బహుళ అంతస్తుల గృహ సముదాయాలు చాలా వస్తున్నాయి, అందువల్ల ఇప్పుడిప్పుడే చిన్న చిన్న క్లీనిక్ లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల గృహ సమూహాలు కడుతూ ఉండటంతో ఆ ప్రాంతమంతా చాలా రద్దీగా ఉంటుంది, ముఖ్యంగా కూలీలతో వారాంతం అయితే తిరునాళ్ళను తలపిస్తుంది ఆ ప్రాంతమంతా.

ప్రతి NRI ఒకటో రెండో సంవత్సరాల తరవాత ఇండియాకి వెళుతూ భయపడేది, దేవుణ్ణి కోరుకొనేది, ముఖ్యంగా పిల్లలకు ఏ జ్వరం రాకూడదని, ఎందుకంటే ఒక నెలకని సెలవు పెట్టి వస్తే మారిన వాతావరణానికి జ్వరమో ఇంకేదో వస్తే డాక్టర్ల చుట్టూ తిరుగుతూ టైం గడిచిపోకూడదన్న ఒకేఒక్క కారణంగా, అలా డాక్టర్ల చుట్టూ తిరిగి అందరి బంధువులనూ  కలవలేక అన్ని తిరగాల్సిన ఊరులూ తిరగలేక, అమెరికా తిరిగి వచ్చి అయ్యో ఇండియా ట్రిప్ ఇలా అయ్యిందే అని భాదపడే వారు ఎంత మందో, తమ ట్రిప్ కూడా అలా కాకూడదని కొంత మంది తమ తో పాటుగా వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకొని వెళితే..అబ్బో వీడికి అమెరికా వెళ్లి పైత్యం పెరిగింది అని హేళన చేసేవాళ్ళు ఎంత మందో..(కొంతమంది డాబు కోసమో, మరే కారణం చేతనో బాటిల్ పట్టుకొని వేలుతూఉందవచ్చు, కానీ తొంబై శాతం మంది విదేశం నుంచి వచ్చిన వారు మాత్రం జ్వరం భయం తోనే వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతారు అని స్వీయ అనుభవంతో చెప్పగలను).

నాకూ జ్వరం వచ్చింది, చెన్నైలో, హైదరాబాద్లో కూడా.....మా అబ్బాయి కైతే ప్రతీ వారం అదే... చెన్నై కేలంబ్బాక్కం లో అప్పటికింకా పిల్లల డాక్టర్ ఒక్కరూ లేరు, తెలిసిన డాక్టర్ కోసమని యిరవై కిలోమీటర్లు వెళ్లవలసిందే.. చెన్నై లోనే కాదు మావాడికి హైదరాబాద్ వెళితే జ్వరం వచ్చింది, అనంతపురం వెళితే జ్వరం వచ్చింది డాక్టర్ల చుట్టూ తిరగడమే ఎక్కడికి వెళ్ళినా....

నాకూ జ్వరం వచ్చింది అన్నా కదా, చెన్నైలో….. సరే రెండు రోజులు చూద్దాం అని సొంత వైద్యం తో వేసుకున్న మందులకు తగ్గని జ్వరం తో ఇక లాభం లేదు అని, OMR సిరుసేరి లో ఏదన్న క్లీనిక్ ఉంటే వెళదాం అని చూస్తే IT పార్క్ దగ్గిరగా మోదటి అంతస్తులో ఒక కొత్తగా ఓపెన్ చేసిన క్లీనిక్ కనపడింది, బయటి వెయిటింగ్ రూం లోని బెంచ్ పైన ఒక అతను పడుకొని ఉన్నాడు, అవతారం చూస్తే కూలీ లాగా ఉన్నాడు, అతని చేతికి సెలైన్ బాటిల్ తగిలించి ఉంది, లోపల డాక్టర్ చాలా యంగ్ గా ఉంది హిందీ అమ్మాయి, మమ్మల్ని చూసి లోనికి రమ్మంది, లోపల బయట పడుకొని ఉన్న మనిషి తాలూకా అతనికి మందుల చీటీ రాసి క్రింది అంతస్తులోని మందుల షాప్ లో మందులు తీసుకొని రమ్మని చెప్పి నన్ను చూడటం మొదలెట్టింది, మాటలలో తెలిసింది ఏమంటే క్లీనిక్ తెరిచి రెండే రోజులైయ్యిందని రోజు సాయంత్రం సమయం లోనే డాక్టర్ ఉంటుందట, మిగతా సమయం లో కేలంబక్కం లోని చెట్టినాడు హాస్పిటల్ లో పనిచేస్తోందిట, మా ఈ మాటల మధ్యలో ఆ కూలీ తాలూకు మనిషి మందులతో వచ్చాడు, అతనికి ఏ మందు ఎప్పుడు వెయ్యాలో చెప్పి వంద రూపాయలు ఫీజు అడిగింది, ఆ వ్యక్తి హిందీ లో అంత తాము ఇచ్చుకోలేము తామంతా ఇక్కడ కూలీలుగా ఉన్నాము కొంచం చూసుకొని తీసుకోమ్మా అన్నాడు, దానికి ఆ డాక్టర్ అమ్మాయి చిరాగ్గా మొహం పెట్టి ఎవరైనా ఒకటే వంద యివ్వు అంది, దానికి అతను మాకు రోజుకు కూడా అంత రావడం లేదమ్మా కొంచం చూసి తీసుకో అంటే, డాక్టర్ ఇంకా కోపంగా, చెప్తే అర్థం కావడం లేదా అందరికీ ఒకటే తగ్గించేదేమీ లేదు అని ఖరాఖండీగా చెప్పింది. అతను ఇంక చేసేదేమీ లేక జేబులోనుంచి పైసలు తీసి ఇచ్చాడు, ఇదంతా చూస్తున్న నాకు ఛా, తాను ఒక కూలీ అని చెప్పినందుకన్నా కొంచం తగ్గించి తీసుకో ని ఉండవచ్చు, ఇలాంటి డాక్టర్ దగ్గిరకా నేను వైద్యానికి వచ్చిండేది అని అనుకొని డాక్టర్ ఫీజు ఇచ్చి అక్కడినుంచి ఎంత తొరగా వెళితే అంత మంచిది అనుకొని వెళ్ళాను.

అప్పుడే MBBS ముగించి ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసమని పార్ట్ టైం క్లీనిక్ ఓపెన్ చేసిన ఒక యంగ్ డాక్టర్, తన పేషెంట్ తాను ఒక కూలీ అని చెపితే(చెప్పాల్సిన అవసరమే లేదు, అతని అవతారం చూస్తే మనిషన్న వాడికి ఎవరికీ అతని దగ్గిర పైసలు తీసుకోవాలని అనిపించదు) కొంచం కూడా కనికరం లేకుండా వంద రూపాయలు ఫీజు గుంజే యంగ్ డాక్టర్లు తయారవుతున్న ఈ కాలం లో మన భవిష్యత్తు ఆరోగ్యం గురించి భయపడటం లో అర్థం ఉందా లేదా?

కనీసం, తోటి హిందీ వాడు, బ్రతుకుతెరువుకోసం ఉత్తర భారత దేశం నుండీ కూలిపని కోసం ఇంత దూరం వచ్చాడు అని అన్నా కొంచం తగ్గించి తీసుకొని ఉండవచ్చు.... కానీ అలా చెయ్యాలి అంటే ఉండవలసింది సామాజిక స్ప్రుహ, మానవతా విలువలు, అవిలేని వారికి అర్థమయ్యేలా చెయ్యడం ఎవరితరం? ఎంత చదివితే మాత్రం వస్తాయి అవి?

కేవలం ఒక డాక్టర్ ప్రవర్తనతోనే అలా అనుకోకూడదు, అందరూ అలా నే ఉండరు కదా, అని మీరు అనొచ్చు, ఇంకొక భయానక అనుభవం చెపుతాను...చదవండి

మా నాన్న వాళ్ళు హైదరాబాద్ లో పద్మారావు నగర్ లో ఉంటారు, ఇంటికి ఎదురుగా గాంధీ హాస్పిటల్ మరియూ మెడికల్ కాలేజీ. (నేను హైదరాబాద్లో ఉన్నంత వరకూ అక్కడే ఉండేవాడిని) ఇదివరకే చెప్పాను కాదా 2011 లో నేను ఇండియా లో నాలుగు నెలలు ఉండాల్సి వచ్చింది అని, అప్పుడే పనిలో పనిగా మావాడికి అక్షరాభ్యాసం చేయిద్దామని చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చాను, ఒకరోజు రాత్రి టైం 12:30 మేమంతా నిద్రపోతున్నాము, హటాత్తుగా పెద్దగా పట్టాసుల చప్పుడు, ఇంక నిద్ర ఎమివస్తుంది అందరమూ లేచి కూర్చున్నాం, ఈ టైం లో పటాసులు ఎవరు కాలుస్తున్నారు నాన్నా అన్నాను మా నాన్నతో, ఏదన్నా పెళ్లి ఉరేగింపు అయ్యుంటుంది అనుకొన్నాం, కానీ హైదరాబాద్ లో రాత్రి పది తరవాత పెళ్లి ఊరేగింపులలో పటాసులు కాల్చడం డప్పు వాయించడం బాన్ చేసారు కదా అనుకొంటూ ముందు వరండా తలుపుతీసి చూసిన నాకు నమ్మసఖ్యం కాలేదు, పటాసులు కాలుస్తోన్నది మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఫ్రెషర్స్ పార్టీ అట.

పక్కనే పన్నెండు అంతస్తుల గాంధీ హాస్పిటల్, వందల మంది రోగులు నిద్రపోతూఉంటారు, చుట్టు పక్కల అంతా ఇల్లు సమయం అర్ధ రాత్రి 12:30 కు పటాసులు కాల్చాలని మెడికల్ కాలేజీ విద్యార్థులకు అనిపించింది అంటే, వావ్ అనిపించింది నాకు, పటాసులు అంటే మామూలువి కాదండి, పైన పేలి పూలలా విరజిమ్ముతూ పెద్ద శభ్డం చేసే పటాసులు.

15 నిమిషాలు గడిచాయి, ఒక పోలీసు పెట్రోల్ వాన్ వెళ్ళింది మా ఇంటి ముందు నుంచి, అమ్మయ్య ఇంక ఆపుతారు అనుకొన్నా, పటాసుల మోత, విద్యార్థుల గోల( విద్యార్థినిలు కూడా ఉన్నారు)  ఆగలేదు, ఇక నాకు సహనం నశించింది హాస్పిటల్ కాంపౌండ్ వాల్ ఎక్కి బాగా తిట్టాలనిపించింది, ఫోన్ తీసుకొని పోలీసు కంట్రోల్ రూంకు డయల్ చేసి విషయం చెపితే, అవతలనుంచి, సర్ విద్యార్థుల తో విషయం, కొంచం సేపు ఓపిక పట్టండి వాళ్ళే ఆపేస్తారు అన్నాడు, నవ్వు వచ్చింది నాకు, చివరికి 1:45 కి పటాసుల గోల ఆగింది విద్యార్థులు పార్టీ ముగుంచి హాస్టల్ రూం లకు వెళ్లి పోయారు.

 మెడికల్ కాలేజీ విద్యార్థులు అంటే ఎంతో మెరిట్ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు, మరి అంత మెరిట్ స్టూడెంట్స్ కు పక్కనే హాస్పిటల్ ఉంది, పటాసులు కాల్చడం ఎంత వరకూ సమంజసం అన్న ఆలోచన రాలేదా? సరే విద్యార్థులకు  రాలేదు, మరి వారికి వైద్య విద్య భోదించే వారికైనా రాదా? వారి అనుమతి లేనిదే విద్యార్థులు ఆ సమయం లో పటాసులు కాల్చారా?వీటికి సమాధానమేంటి?

కొస మేరుపెంటంటే, అప్పుడప్పుడూ పటాసులు కాలుస్తూ ఉంటారంట మెడికల్ కలేజీ విద్యార్థులు, మా నాన్న చెప్పారు.

పక్కనే ఉన్న హాస్పిటల్ లో రోగులకు అసౌకర్యం కలుగుతుంది అన్న ఆలోచనే లేని వీరు మన ఆరోగ్యం కాపాడే రేపటి వైద్యులు, వావ్ చాలా బాగుంది ఆలోచన కదా.... బాగుందా .... భయంకరంగా ఉందా?

****
మారుతున్న మానవతా విలువలతో పోటీ పడి, ఎదుటి వాడి భయమే పెట్టుబడిగా వైద్యుల ప్రవృత్తి లో వస్తూన్న మార్పులు.... భావితరాల ఆరోగ్యాన్ని ఎంత వరకూ కాపాడతాయో కదా.....

  

భహుశా ప్రతీ సంవత్సరం MBBS కొత్త బాచ్ మొదటి లెక్చర్ ఇలా నే ఉండొచ్చు, మనవాళ్ళకి రోగం మీదకన్నా రొక్కం మీద ప్రేమ పెరుగుతూ ఉన్నట్టుంది అందుకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారు కొంతమంది మన డాక్టర్లు.



వైద్య విద్యతో పాటు గా మానవతా విలువలు అవసరం, అన్నఅద్భుత సందేశం తో నిర్మించిన మన మున్నాభాయ్ MBBS చిత్రం చూసినప్పుడు ఏదోలే అనుకొన్నాను కానీ, వైద్యుడు అన్న వాడికి సామాజిక స్పృహ అవసరం, ఆవశ్యకత ఎంత అన్నది ఆలోచిస్తే అనుభవపూర్వకంగా తెలిసింది.


*****