Tuesday, September 4, 2018

ఉమ్మడి పౌరస్మృతి


Q. భారతదేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమా?

భారతదేశం భిన్న సంస్కృతులు కలిగిన దేశం, ఇతర దేశాలతో పోల్చి చూస్తే  భారతదేశం ప్రత్యేకత ఈ భిన్నత్వమే. వివిధ మాతాలు, వివిధ కులాలు, వివిధ భాషలూ వివిధ సంస్కృతులూ, కానీ అందరూ ఒకే దేశ పౌరులు. ఈ భిన్నత్వం లోని ఏకత్వమే అతి పెద్ద ప్రజాస్వామ్య భారత దేశాన్ని ప్రపంచ దేశాలలో ప్రత్యేకంగా నిలిపే అంశం.

బారత రాజ్యాంగం వ్యక్తి స్వాతంత్రానికి విలువనిస్తూ, పౌర హక్కులను కల్పించింది, అనగా రాజ్యాంగ పరంగా పౌరులందరూ సమానమే. కానీ వివిధ మతాలకు చెందిన ప్రజలు మైనారిటీ వర్గాలుగా ఉన్న మనదేశంలో, వారి సాంస్కృతిక స్వాతంత్రియాన్నికాపాడే ఉద్దేశంతో, భారత దేశ భిన్నత్వాన్ని కాపాడే ఉద్దేసంతోనూ, మత పరమైన అంశాలలో ప్రభుత్వ జ్యోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో వారి వారి మత ప్రభోధాలను గౌరవిస్తూ, వాటికనుగునంగా చట్టాలు చేయబడినాయి. అందులో వివాహ సంభందించిన చట్టాలు ముఖ్యమైనవి. అనగా తమ మతాన్ననుసరించి వివాహచట్టం వర్తిస్తుoదన్న్నమాట. కానీ కొన్ని అంశాలు ప్రస్తుత ఆధునిక ఆలోచనా విధానందృష్ట్యా చూసినప్పుడు, స్త్రీ పురుషసమానత్వం దృష్ట్యా చూసినప్పుడు అనాగరికం అనిపించడం వాస్తవం. ప్రత్యేకించి స్త్రీ పట్ల వివక్షా పూరితంగా ఉంటాయనటంలో సందేహమే లేదు. మరి పౌరులంతా ఒక్కటే అని నినదించే రాజ్యాంగం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించటం ఎంతవరకూ సంజసమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ భిన్నత్వాన్ని, ప్రజల  వారి వారి మాతాచారాలను గౌరవిస్తూనే, పౌరులు వివక్షకుగురికాకుండా చూడవలసిన అవసరమూ రాజ్యాంగానికి ఉంది.

ప్రస్తుత అధునాతన యుగంలో, ప్రతీవ్యక్తీ తన ఆలోచనా విధానుసారంగా తన జీవితనేపధ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దృష్టితో ఆలోచించినప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఎంతైనా ఉంది అని అనిపించక మానదు. కానీ దేశ ప్రజలందరికీ అమోధయోగ్యమైన పౌరస్మృతి నిర్మించటం అన్నది ఇప్పటి మన సామాజిక వ్యవస్థలో అత్యంత కష్టం, అందుకు కావలసిన మానసిక పరిణతి ఇంకా మనకు లేదని చెప్పక తప్పదు. కానీ మారుతున్న ఆలోచనాసరళితో, అందరూ సమానమే అన్న మానసిక వికాసం పొందిన వారికి తమ వ్యక్తిగత ఆలోచనానుసారంగా ఉమ్మడి పౌరస్మృతిని అవలంభించ వలసిన అవకాశం రాజ్యాంగo కల్పించాల్సిన అవసరం ఉంది. అనగా మతపరమైన ప్రస్తుత చట్టాలతో పాటుగా తటస్థంగా కూడా వివాహచట్టాలు ఉండాల్సిన అవసరo కూడా ఉంది. తమను తాము ఏమతానికీ సంభందించినవారు కాదు అనుకొనేవారికి తటస్థ చట్టం వర్తింప చేయవచ్చు. ఎందుకంటే కేవలం ఒకమతంలో పుట్టినందుకు తమకు ఇష్టం లేకున్నా ఆ మతపరమైన చట్టాన్ని తన మీదరుద్దటం అన్నది, వ్యక్తి స్వాతంత్రానికి విరుద్ధమే అవుతుంది. ఈవిధమైన మార్పు ఒక్కసారిగా జరగడం అన్నది మనసామాజిక, రాజకీయ వ్యవస్థలో అసాధ్యం. కానీ ఆవైపుగా మన ప్రయత్నం తప్పకుండా చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంగానే 21వ న్యాయ కమీషన్ కొన్ని సూచనలు చెయ్యడం జరిగింది. మతపరమైన వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తూనే ఆచారాల పేరుతో జరిగే కొన్ని దురాచారాలకు వ్యతిరేకంగా వ్యాక్యానించింది. ఉదాహరణకు తలాక్ విధానం, బాల్యవివాహాలు మోదలగునవి.

కమీషన్ చేసిన కొన్ని సూచనలు మతాలకతీతంగా వర్తించేవి కావడం హర్షణీయం. ముఖ్యంగా వివాహ వయసు స్త్రీపురుషులకు సమానంగా 18 సంవత్సరాలు, వివాహసమయంనుంచి సంపాదించిన ఆస్తులపై విడాకుల అనంతరం దంపతులకిద్దరికీ సమాన హక్కు ఉండటం, అన్ని వివాహ చట్టాలలోనూ వితంతువులకు ఆస్తి హక్కు కల్పించడం ముఖ్యమైనవి.

ప్రస్తుత పరిస్థితులలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదoటూనే, అన్ని మత చట్టాలలో సమానంగా అమలు పరచవలసిన సూచనలు చెయ్యటం అన్నది, ఉమ్మడి పౌరస్మృతి దిశగా వెళ్ళటానికి వేసిన మొదటి అడుగుగా అనిపించటం వాస్తవం.

దేశభిన్నత్వాన్ని కాపాడుకుంటూనే, అధునాతన ఆలోచనావిదానాలకనుగునంగా వ్యక్తి స్వాతంత్ర్యానికి ప్రాధాన్యతనిస్తూ,, అందరికీ సమానంగా వర్తించే ఉమ్మడి పౌరస్మృతి ఏనాటికైనా మన రాజ్యాంగంలో భాగమౌతుందని ఆసిద్దాం.