Monday, March 26, 2012

జగన్నాటకసూత్రధారీ.. శరణు... శరణు..



విష్ణుమూర్తి తన కాళ్ళు పడుతూ తూగుతున్న లక్ష్మీదేవిని చూసి ముసిముసిగా నవ్వుకొని, ఆమెని కదిలించడం ఇష్టంలేక తన   దృష్టిని భూలోకం వైపు మరల్చాడు, విష్ణుమూర్తి దృష్టి ఆంధ్రదేశం లో జరుగుతున్న ఒక సంఘటన మీద పడింది.

అది ఒక ప్రభుత్వ కార్యాలయం, పెన్షన్ కోసం పంపిన తన అభ్యర్థన ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని పెన్షన్ డిపార్టుమెంటు ఉద్యోగి బల్ల వద్ద నిలుచొని...

రిటైర్డ్ ఉద్యోగి: నా ఫైల్ ఎంతవరకు వచ్చిందండీ!

ప్రభుత్వ ఉద్యోగి: ఏమిటండీ, ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు, మీరూ ప్రభుత్వ వుద్యోగే కదా! మీకు ఫార్మాలిటీస్ తెలియవా?

రిటైర్డ్ ఉద్యోగి: అదేనండి! దానిగురించే మాట్లాడతామని వచ్చా! మీరు ఆ ఫార్మాలిటీ చెప్తే ... అంటూ నసిగాడు

ప్రభుత్వ ఉద్యోగి: ఇందులో మాట్లాడడానికి ఏముంది, స్టాండర్డ్ గా 5 సంవత్సరాల మీద 5% కదా!

రిటైర్డ్ ఉద్యోగి: సార్ 5% చాలా ఎక్కువ.... అంటూ నసిగాడు
ప్రభుత్వ ఉద్యోగి: ఏంటండి బేరమడుతున్నారా? ఇవన్ని ముందుగానే ఫిక్స్ చేసిన రేట్లని మీకు తెలియదా? మీరు మీ ఆఫీసులో ఏమన్నా డిస్కౌంట్ ఆఫర్ లు ఇచ్చేవారేమో, ఇక్కడ అలాంటివేమీ లేవు.

ఈయన చూడండి, బేరమడుతున్నాడు,  అని పెన్షన్ కార్యాలయం లోని మిగతావారికి పెద్దగా చెప్తూ ఎగతాళిగా నవ్వాడు ప్రభుత్వ ఉద్యోగి

రిటైర్డ్ ఉద్యోగి: అలా మాట్లాడకండి సార్!. పైన దేవుడున్నాడు చూస్తున్నాడు, దయ చూపండి.. అంటూ గోడ మీద వున్న వెంకటేశ్వర స్వామి పటం వైపు చూసాడు.

ప్రభుత్వ ఉద్యోగి: సర్లేవయ్యా! ఆప్పుడప్పుడు వెళ్ళి ఆయనకీ సమర్పించుకుంటున్నాముగా!
ఇక చేసేదేమీలేక వెంకటేశ్వరస్వామి ఫొటోకు దండం పెట్టి బయటకు నడిచాడు రిటైర్డ్ ఉద్యోగి.

ఇదంతా చూస్తున్న విష్ణుమూర్తిలో ఏమర్పూ లేదు, అలానే చిద్విలాసంగా చూస్తూ వున్నాడు.... ఇంతలో...
నారాయణ... నారాయణ అంటూ నారద మహర్షులవారు వేంచేశారు

నా.మహ: స్వామి వారికి ఇంకా దయ కలుగుతునట్టులేదు ఇంత జరుగుతున్నా...

వి.మూ: ఏమిటి నారదా అది! అన్నారు అమాయకం నటిస్తూ.

నా.మహ: అదే స్వామీ... ఇంతదాకా మీరు చూస్తున్నదాని గురించే.... ప్రభుత్వ కార్యాలయంలో ఇంత బాహాటంగా లంచం అడుగుతున్నాడు, ఎంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడో చూడండి వాడు..
వింటున్న లక్షీదేవి మనసులో..ఇందులో బరితెగింపు ఏముందీ.. అందరూ చేస్తున్నదే కదా వాడు చేసున్నాడు ... ఈ బ్రహ్మచారికేం తెలుస్తాయి, ఇప్పటి ఆధునిక యుగంలో అసలుకి కొసరు సంపాదన లేకుండా సంసార సాగరాలను ఈదడం అంత సులువు కాదని!. నా భక్తురాండ్ర కోరికలు, పడుతున్న కష్టాలు తీరాలంటే వారి భర్తలకు తప్పదు కదా! అనుకొంటూఉంది...

నా.మహ:  మానవులలో పాపభీతి నానాటికి తరుగుతోంది. లంచంతీసుకోవడమన్నది ఒక నేరం.. పాపం అన్న స్పృహే లేకుండా పోతోంది స్వామీ.. మనుషులలో దైవచింతన కరువయిపోతోంది ప్రభూ!
లక్ష్మీదేవి: దైవచింతన కరువయిపోతోందంటున్నారు, అదెలా మునీంద్రా, ఇప్పుడు పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట లాడుతోంటే...

నా.మహ: చేసిన పాపం సమసిపోతుందనే భావన తోనే పుణ్యక్షేత్రాలకు రద్దీ పెరుగుతోంది కానీ దైవ చింతనతో కాదనుకుంటా జగన్మాతా!
ఎంత సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటున్నారు... సంపద కలవాడిదే కాలం, వారే నాయకులు, యువత కూడా వారినే ఆదర్శంగా తీసుకుంటున్నారు. అత్యుత్తమ చదువులు చదివి కూడా విచక్షణ మరచి అందిన కాడికి దండుకొంటున్నారు, వక్రమార్గాలలో సంపాదించడమే సక్రమమైపోతోంది.... యిక ఆలస్యం చెయ్యకండి స్వామీ!

వి.మూ: ఆలస్యం దేనికి మునీంద్రా! అన్నాడు ఏమీ తెలియనట్లు..

నా.మహ: దేనికంటారేమిటి స్వామీ... ఇలాగే కోనసాగితే, దేవుడుకూడా అంగట్లో దొరికే సరుకై, మన మీద ఇంకా మిగిలి వున్న ఆ కొంచం నమ్మకం కూడా కరవవుతుంది..  ..ఇలా ఇంకా ఎంతకాలం ప్రభూ...

వి.మూ: మరి దానికి పరిష్కార మార్గామేమిటో మీరే సెలవీయండి...
నారద మునీంద్రులవారికి ఒకింత ఆశ్చర్యంగా వుంది, విష్ణుముర్తులవారి తీరు

నా.మహ: అదేమిటి స్వామీ! ధర్మో రక్షతి రక్షతః అన్నారు కదా! ఇప్పుడు ధర్మాన్ని రక్ష్చించే వారే కరువైపోతున్నారు. అసలు, మీరు మరచితిరా లేక ఇది నా మేధస్సుకు పరీక్షా! కృష్ణావతారంలో తమరే కదా సెలవిచ్చారు.. ఎప్పుడు ధర్మం అంతరిస్తుందో అప్పుడు, ధర్మసంస్థాపనార్థం మరలా ఉద్భావిస్తానని ధర్మపరిరక్షణ చేస్తాననీ..

ఇది విని లక్షీదేవి కి చిర్రెత్తుకొచ్చింది.. మనసులో ఆందోళన మొదలయ్యింది.. ఈ బ్రహ్మచారి మాటలువిని ఇప్పుడు పాపం పండింది అని కొంపదీసి ఈయన కొత్త అవతారమని హడావిడి చెయ్యడు కదా... ఇప్పటికి ఇప్పుడు భూలోకం లోకి వెళ్లి ఎవడు పడతాడు ఆ భాదలు...అమ్మనీ.. తంపులమారీ.. నా సంసారానికే పెట్టావా ఎసరు....
లక్ష్మీదేవి అంతరంగంలోని ఆలోచనలు గ్రహించిన విష్ణుమూర్తి మనసులోనే నవ్వుకున్నాడు

ఇంతలో లక్ష్మీదేవికి ఒక బృహత్తరమైన ఆలోచన వచ్చింది... వెంటనే తన మనః శక్తితో ఇంద్రులవారికి సందేశం పంపింది విషయం అంతా వివరిస్తూ, ఈయన ఆవేశ పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతూ..

ఆ సమయలో ఇంద్రుడు తన ఏకాంత మందిరంలో అప్సరస కాంతలతో సరసాలాడుతూ తన లేటెస్ట్ ఐఫోన్ లో SPONGE BOB SQAREPANTS చూస్తూ ఆనందిస్తున్నాడు..

స్వర్గానికి వచ్చే మానవులే లేక, మన ఇంద్రులవారిది రోజూ ఇదే తంతు, అప్సరసలతో కులుకుతూ, facebook లో చెత్త జోకులు చదువుతూ, ఐపాడ్ లో ఆటలాడుతూ..
(చెప్పనేలేదు కదా.. ఇంద్రుడు వాడుతున్న ఈ ఐపాడ్ ఆమధ్య 2జి స్పెక్ట్రం వారు స్వర్గలోకం రావడానికి మొక్కుబడిగా సమర్పించుకొన్న అనేక అతి ఖరీదైన వాటిలో ఒకటి. తనకు పంపించే సందేశాలను ఐపాడ్ ద్వారా చదవడానికి, తిరిగి జవాబు పంపడానికి తగిన interface technology కూడా ఏర్పరుచుకున్నాడు.)

ఇంతలో లక్ష్మీదేవి పంపిన సందేశం తన ఐపాడ్లో చదివి, విషయం గ్రహించి, తిరుగు టపా పంపారు, ఏమీ ఆందోళన పడవద్దు అంతా తను చూసుకుంటానని..
ఇంద్రుడు పంపిన జవాబుని తన శక్తితో తెలుసుకున్నాక లక్ష్మీదేవి మనసు కుదుటపడింది... ఈ ఇంద్రుడు ఎంతకైనా సమర్థులు..... కానీ ఈలోపు వీరి సంభాషణను మరల్చాలి.. అనుకొంటూ

లక్ష్మీదేవి: ఇప్పుడు అంత ఏమి మునిగిందని నారదులవారు కొత్త అవతారము అంటున్నారు, స్వామి వారు తప్పు చేసిన వారిని శిక్షిస్తూనే వున్నరుకదా!

నా.మహ: అదేమిటి మాతా అలా అంటారు, శిక్ష ఎంతమందికి పడుతోంది, కోటికి ఒక్కడికి...

లక్ష్మీదేవి: 2g స్పెక్ట్రం విషయంలో పాపం ఆడకూతురని కూడా చూడకుండా కారాగారానికి పంపారు, గనుల కుంభకోణంలో మరో ఆడకూతురికీ అదే గతి పట్టించారు, కనీసం నా పేరే పెట్టుకొందన్న కనికరం కూడా లేదు,  ఇదెక్కడి న్యాయం.....

నా.మహ: మాతా మీరు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు, ఇక్కడ సమస్య కేవలం ఆడవారితోనే కాదు..

లక్ష్మీదేవి: శిక్షలే పడలేదు అంటున్నారుకదా మరి, వీరికి పడ్డది శిక్షకాదా!. (సంభాషణ పొడిగించే ఉద్దేశంతో అంటూ)

ఏమిటి ఈ ఇంద్రుడు ఇంకా రాలేదు, ఇంకా ఏ వెధవేషాలేస్తూ ఉన్నాడో అనుకొంటూండగా...
ఇంద్రుడు, యమధర్మరాజూ వైకుంఠ ద్వారం గుండా వస్తూండటం చూసి, వారికి ఎదురేగి (ప్రోటోకాల్ కూడా మరచి) చిరు కోపంతో ఇంద్రుడిని లోపలికి రమ్మని చేతితో సంజ్ఞ చేసింది.

ఇంద్రుడు లోపలి గదిలోకి రాగానే లక్ష్మిదేవి కోపంతో......

లక్షీదేవి: నేను ముందే సమాచారం పంపించినా యిలా చేసావేంటి?

ఇంద్రుడు: అదేమిటమ్మ, మీ సమాచారం అందగానే నేను అప్రమత్తమై ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా యములవారితో సహా వచ్చితిని కదా!

లక్షీదేవి: ఖర్మ, పెళ్లికిపోతూ పిల్లిని చంకలో పెట్టుకొన్నట్లు.. ఆ యములవారిని ఎందుకు వెంటపెట్టుకొనివొచ్చారు, మీ తెలివి ఏమైంది?

ఇంద్రుడు: మీరు నిశ్చింతగా వుండండి, వస్తూ వస్తూ పెద్దాయనని ఎలా శాంత పరచాలా అని ఆలోచిస్తూనే వున్నాను.

లక్షీదేవి: సరే సరే, జరిగిందేదో జరిగింది ..ఇప్పుడు ఆయనని శాంత పరిచి, కొత్త అవతారపు ఆలోచనలు రాకుండా చూడండి!

సమాలోచనల తరువాత వారు విష్ణుమూర్తి వున్న దర్బార్ కు వచ్చారు..
మన నారద మహర్షి దృష్టి ఇంద్రుడి చేతిలోని లేటెస్ట్ ఐపాడ్ మీద పడింది.

నా.మహ: దేవతలకు కూడా ఖరీదైన కానుకలు సమర్పించడం ఈమధ్య ఎక్కువైంది స్వామీ!

విని కూడా విననట్టు వుండి పోయారు విష్ణు మూర్తుల వారు. ఈ కలహభోజనుడి చూపు నా ఐపాడ్ మీద పడిందే అనుకున్నాడు ఇంద్రుడు ..

వి.మూ: ఏమిటి యమా ఈమధ్య బొత్తిగా నల్లపూసైనారు, అంతా సౌఖ్యమే కదా!

యమ: ఏమి సౌఖ్యము స్వామీ.. మీకు తెలియంది ఏమున్నది..

వి.మూ: అదేమిటి యమా, అంత నీరసంగా మాట్లాడుతున్నారు, ఆరోగ్యమేకదా..

యమ: పెరిగిన పాపులతో తీరిక లేకుండా వుంది, ఇంకా ఆరోగ్యం పైన చింత ఎక్కడ స్వామీ.. పగలనకా రాత్రిఅనకా పాపులతోటే సహజీవనమైపోయింది.. సంసారం మరిచానని శ్రీమతి కూడా పేచీ పెడుతోంది, ఈ నరక జీవితం నరకప్రాయమైయింది స్వామీ..

ఇంతలో ఇంద్రుడు విషయం చెయ్యి దాటి పోతోందని తలచి..

ఇంద్ర: అదేమిటి యమా నరకంలో పని భారం తగ్గించదానికి మా స్వర్గంనుంచి చాలామంది భటులను పంపితిమి కదా ఆమధ్య..

యమ: ఆ.. పంపితిరి, వారితో చేరికూడా రోజుకు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నా పాపుల సంఖ్య తరగడం లేదు..చిత్రగుప్తులవారికి పాపుల చిట్టా తయారికి, వుంచుటకని ఒక software పాపి సలహా మేరకు పెద్ద mainframe అను యంత్రమును తెచ్చితిమి.. అది కూడా ఈమధ్య మొరాయిస్తూవున్నది వొత్తిడి తట్టుకోలేక... ఇక భటులను తలచుకొంటే మనసు తరుక్కుపోతోంది ప్రభూ!

నా.మహ: చూచితిరా నేను అప్పుడే చెప్పితి కదా మానవులలో పాపచింతన తరిగిందని...

వి.మూ: మరి ఇపుడేమిటి కర్తవ్యము..

ఇంద్ర: అదేమిటి నారద, అప్పటికీ స్వాములవారు చాలా మంది పెద్దలకు శిక్ష వేసారుకదా... ఉదాహరణకు 2g స్పెక్ట్రం లో లక్ష కోట్లు, క్రీడల్లో వెయ్యి కోట్లు, గనులలో మరో లక్ష, భూముల పందేరంలో ఎన్నోకోట్లు మింగిన వారందరికీ శిక్ష పడినది కదా...కొన్నాళ్ళు వేచి చూడాలి మార్పు రావడానికి

నా.మహ: ఇంద్రా! నీవు చెప్పినవారందరూ పెద్దవారు, వారికి పడ్డ శిక్ష వల్ల సామాన్య మానవునికి వోరిగేది ఏమీ లేదు. ప్రస్తుత కాలంలో సామాన్య మానవుని దైనందినజీవితంలో అవినీతి  అన్నది భాగంగా మారిపోయింది, దానివల్ల కలిగే నష్టం వారికి తెలియడం లేదు..అది ఒక మానసిక రుగ్మత గా అవతరించింది... మానవున్ని పాతాళంలోకి ముంచేస్తోంది వారిని ఆ స్థితి నుంచి బయట పడవేయాల్సిన సమయం ఆసన్నమైనది..

వింటున్న విష్ణుమూర్తి వదనం గంభీరంగా మారడం చూసిన లక్ష్మిదేవికి నారదులవారి మీద పట్టలేని కోపంతో.. అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయింది.
పెట్టావుగా మామద్యన కలహం అని నారదుడి వైపు చూసి లక్ష్మీదేవి వెళ్ళిన వైపుగా వెళ్ళిపోయారు విష్ణుమూర్తి.

ఈలోగా తన ఐపాడ్ google search లో “How to live on Earth for next 100 years” టైపు చేయసాగాడు ఇంద్రుడు. భవిష్యత్తులో లక్ష్మీదేవుల వారికి అవసరపడుతుందేమోనని.

విష్ణుమూర్తి వెళ్ళేటప్పటికి తమ ఏకాంతమందిరంలో అలకపానుపుపై పవలించివున్నది లక్ష్మీదేవి.

వి.మూ: లక్ష్మీ! ఎందుకీ అలక!

లక్షీదేవి: మీరు కొత్త అవతారానికి సమాయత్తమవుతున్నారు కదా! మళ్ళీ మానవులుగా పుట్టి కష్టాలను అనుభావించాల్సిందేనా?

వి.మూ: అంత అవసరంలేదు లక్ష్మి! అది ఒకప్పుడు అనాగరికం, నిరంకుశత్వం, రాచరికం రాజ్యమేలుతున్నప్పుడు. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం. మనమిప్పుడు చేయాల్సింది కేవలం ప్రజలను చైతన్యపరచడమే! అరాచకం మీద తిరగాబడడానికి, యుద్ధం చేయడానికి వారికి తగిన మనోస్థైర్యం కల్పించడమే! ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలను పటిష్టంగా పనిచేయడానికి దారులు కల్పించడమే మనం చేయవలిసింది. దానికి మరో కొత్త అవతారం అవసరం లేదు. కావాలంటే ఇది చూడు!
తన పెన్షన్ కోసం తిరిగిన రిటైర్ట్ ఉద్యోగి నుంచి లంచం తీసుకొంటూన్న ప్రభుత్వ వుద్యోగి ACB అధికారులకు పట్టుబడుతుండడం కనిపించింది. అలా ప్రభుత్వ వుద్యోగి పట్టుబడేటట్టు ఆ రిటైర్ట్ ఉద్యోగి, ముందే అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల జరిగింది. అతనిలో ఆ చైతన్యాన్ని, స్తైర్యాన్ని నింపింది మన చిద్విలాసుడు, జగన్నాటకసూత్రధారి మన విష్ణుమూర్తియే!

 ఇదంతా పైనుండి వీక్షించిన లక్ష్మీదేవి మనసు అప్పటికి కుదుటపడి విష్ణుమూర్తి ఎదపై తలవాల్చి సేదదీరింది.

సమాప్తం.

Saturday, March 24, 2012



ప్రేక్షక మరియూ పాటక దేవుళ్ళూ... నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

బ్లాగు ప్రపంచం లోనికి అడుగుపెడుతున్న నన్ను, వ్యక్తపరిచే నా అభిప్రాయాలను సహృదయంతో మరియూ సద్భావనతో ఆహ్వానించి, ఆశీర్వధిస్తారని ఆశిస్తూ... మీ సహోదరుడు......