Sunday, May 27, 2012

అభినయానికి పెద్దన్న మా అన్న.......


నేను నా తల్లి తండ్రుల తరవాత అభిమానించేది,  స్ఫూర్తి పొందేది అన్నగారి నుంచే..... అదేనండీ మన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ Dr. నందమూరి తారక రామారావు గారు....

NTR.... తలచుకొన్న ప్రతీసారీ ఏదో ఆవేశం....

 అదంతా 2000 వరకే నండోయ్.......

ఆ తరవాత ఏమైంది?

ఆ... ఏమి అయ్యిందా??

2000 లో......నా పెళ్లి అయిందండీ....

ఐతే....

ఇంకేంటి... ఖేల్ ఖతం... దూకాన్.... భంద్.....

మరి ఆవేశం???

ఆ...వే...శం...ఆవిరై.... గొంతులో..... మ్యావ్..... మ్యావ్....మిగిలింది.

 ***

1977 అడవిరాముడు, విడుదల.... అది... అక్కడ మొదలయ్యింది......

 సినిమా స్కోప్ లో స్క్రీన్ పైన పెద్ద పెద్ద ఏనుగులు, చిన్న వాడిని కదా, వింతగా ఉన్నింది... ఇప్పటికీ గుర్తు నాకు అన్నగారు ఏనుగు మీద కూర్చొని వెళ్ళే సీన్...ఆరేసుకోబోయి పారేసుకున్న సాంగ్....
 



 1977 యమగోల... అన్నగారు యమలోకం లో చేసిన హడావిడి.... నాలో అలజడి....అన్నగారు చేసిన కామెడీ.... గిలిగింతలు పెట్టించింది...

బాగా గుర్తుండి పోయింది మాత్రం ... కాకి, కోడి సీన్, ఆడవె అందాల సురభామిని సాంగ్ ఇంకా సమరానికి నేడే ప్రారంభం సాంగ్..
 


1977 లోనే విడుదలైన దాన వీర సూర కర్ణ నాకు గుర్తు లేదు, నేను నా ఇంటర్ లోనే చూసా ఆ సినిమా... కానీ డైలాగ్స్ మాత్రం కేసెట్ ప్లేయర్ లో వినే వాన్ని, హైదరాబాద్ లోని మా బాబాయ్ ఇంట్లో.....




1980 సర్దార్ పాపారాయుడు...


1981 కొండవీటి సింహం..... అప్పటికి నేను ఏడవ తరగతి....ఈ రెండు చిత్రాలతో నా మైండ్ లో హీరో అంటే ఇతనే అని ఫిక్స్ అయిపొయింది...

ఇక్కడ నాకు ఇప్పటికీ గుర్తుండే ఒక సంఘటన చెపుతాను... మేము అనంతపురం కోర్ట్ రోడ్ లో ఉండే వాళ్లము అప్పుడు, అంటే శాంతి ధియేటర్ వెనకగా అన్నమాట, మన అన్నగారి ప్రతీ సినిమా ఆ ధియేటర్ లోనే విడుదల అయ్యేది, ఆ ధియేటర్ ను ఓపెన్ చేసినది కూడా అన్నగారే...

కోoడవీటి సింహం విడుదలైన మొదటి వారం ఒక రోజు రెండో ఆట సమయంలో ధియేటర్ వద్ద ఏదో గొడవ జరిగిందని వార్త, మరుసటి రోజు ఉదయం తెలిసిందేమంటే, అనoతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజ్ ట్రైనీ ఎస్సై లు టికెట్స్ దొరక లేదని గొడవ చేసి ధియేటర్ అద్దాలు పగల గొట్టారని.... అన్నగారు ఖాకీ యూనిఫారం వేస్తే... అదీ జరిగింది...

తెలుగు సినిమా తెరమీదే కాదు పోలిస్ యూనిఫారం వేస్తే, SP రంజిత్ కుమర్ లా ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్  చేసారు అన్నగారు ఆ సినిమాతో...


1982 బెబ్బులి పులి... వావ్...... కోర్ట్ సీన్.... దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్.... ఆ నటన...ఆ ఆవేశం... అరవై ఏళ్ళ వయసులో నటుడుఅన్నవాడి కెవరికైనా సాధ్యమా? నాలో అభిమానం విజ్రుమ్భించింది.....నర.. నరాలలోకీ పాకింది...

నేను అనంతపురం పొట్టి శ్రీరాములు మునిసిపల్ స్కూల్ లో ఎనిమిదవ తరగతి, అప్పట్లో ఏదన్నా పీరియడ్ లో టీచర్ రాలేదంటే, కథలు చెప్పించే వారు... మా క్లాసు లో రాజు, సినిమా కథలు భలే చెప్పేవాడు, సినిమా చూస్తున్నట్టే ఉండేది... మా వాడు బెబ్బులి పులి విడుదలైన రోజే చూసోచ్చాడు... టౌన్ లో అంతా సంచలనం ఆ సినిమా విడుదలైన తరవాత, అనంతపురం త్రివేణి ధియేటర్  తిరునాళ్ళను తలపించేది జనంతో...మనవాడు క్లాస్ లో చెప్పాడు కదా ఇంక మనం ఆగుతామా... చూసా... చూసి మైండ్ బ్లాంక్ చేసుకొని వచ్చా.....



1982 అన్నగారి రాజకీయ రంగ ప్రవేశం, ఒక సంచలనం.....

అనంతపురం శాంతీ ధియేటర్ లో కార్యకర్తల సమావేశం... చెప్పా కదా మేము శాంతీ ధియేటర్ వెనకాలే ఉండే వాళ్ళమని, నేను మా ఎదురింట్లో శీను, అన్నగారంటే శీను కీ అభిమానమే, ఇంకే యిద్దరూ కలిసి శాంతి ధియేటర్ వెనకాలి టికెట్ కౌంటర్ ఎక్కి లోపలికి దుంకాం... దుంకగానే ఒక గేటు కీపర్ పెద్ద వెదురు కర్ర తో వచ్చాడు అదే క్షణం అన్నగారు మీటింగ్ ముగించి ఒక రూపాయి ఎంట్రెన్స్ నుంచి బయటికి వచ్చారు, అంతే మనపై ఎక్కు పెట్టిన కర్ర దించి గేటు కీపర్ జనాలని అదుపు చేసేందుకు అటువైపుగా వెళ్ళాడు.... ఆ దెబ్బ పడకుండా నన్ను అన్నగారే రక్షించారు.... తెల్లటి పెద్ద పంచ తెల్లటి జుబ్బా లో అన్నగారిని చూసి పులకించి పోయాం ...ఆక్షణం ఇప్పటికి అలానే ఉంది మైండ్లో.... అదే మన తొలి ఎన్కౌంటర్ అన్నగారి తో...

ఖాఖీ డ్రెస్సులో అన్నగారు చైతన్యరథం ఎక్కి వస్తే, తమకోసమే శ్రమించడానికి వచ్చిన నాయకుడని హారతులతో  నీరాజనాలు పలికారు జనం


ఇప్పటికీ గుర్తు రోజూ పేపర్ లో అన్నగారి చైతన్య రథ యాత్ర అప్ డేట్ ఉండేది, అన్నగారు ఏ ఊరిలో ఉన్నారు, ఎక్కడ స్నానం చేసారు, ఎక్కడ తిన్నారు, ఎప్పుడు పడుకొన్నారు, ఫోటోలతో సహా.....
ఆ వయసులో ఏకధాటిగా డెబ్భై వేల కిలోమీటర్లు పైగా ఆంధ్రదేశమంతా పర్యటించారు అన్నగారు.

తరవాతి ఎన్నికలలో ఎమిజరిగిందో నేను చెప్పక్కరలేదు... శాతాభ్ద కాల చరిత్ర కల కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్....

1984 రాజకీయ సంక్షోభం... ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రిని అందులోనూ అన్నగారిని కుర్చీనుంచి తొలగిస్తే.... ఆంధ్రదేశమంతా అల్ల కల్లోలం... అనంతపురం అతలాకుతలం... అసలు మొదటి ఆందోళన అనంతపురంలోనే ప్రారంభమయ్యింది... కాంగ్రెస్స్ కు మరో దెబ్బ....అప్పుడే మనలోనూ రాజకీయ చైతన్యం మొదలయ్యింది.

 ఆ తరవాత ఎన్నో సార్లు అన్నగారు అనంతపురం రావడం ప్రతీసారీ ఆయన మీటింగులు అటెండ్ కావడం, మోటర్ బైక్ ర్యాలీలు.... ఇలా జరిగి పోయింది...

 1991 రాజేవ్ గాంధీ మరణాంతరం జరిగిన అల్లర్లలో, కొంతమంది రాజకీయ కక్షతో హైదరాబాద్ అబిడ్స్ లోని రామకృష్ణ ధియేటర్లను ధ్వంసం చేస్తే, నిరసనగా నిరాహార దీక్షచేసి, అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చారు అన్నగారు, అనంతపురం శివారులో ఆగి ఉన్న అన్నగారిని కలిసి ఆలింగనం చేసుకొన్న ఆక్షణం, ఎప్పటికైనా మరిచిపోతానా.. ఆయన అభిమానిగా.....


తనను అభిమానించిన తెలుగు ప్రజల ఋణం తీర్చుకోవాలని రాజకీయాల లోకి వచ్చి, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతమందికో తన పిలుపుతో రాజకీయ ప్రవేశం చేయించి చట్ట సభలలో కూర్చోపెట్టిన ఆయన, ఎన్నో సంచలన పథ కాలను ప్రవేశ పెట్టిన ఘనుడు. భారత దేశానికి ప్రధానిగా, కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మహిళలు పదవులు చేపట్టారు, కానీ తనను అభిమానించిన తెలుగు ఆడపడుచులకు ఆస్తి హక్కు కలిగించిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి మన అన్నగారు, దేశంలో అది ఒక సంచలనాత్మక మార్పు, మద్యపాన నిషేధం, మద్యాన్న భోజనం, రెండు రూపాయల కిలోబియ్యం... ఇలా ఎన్నో....
 




 1993 మేజర్ చంద్రకాంత్... డెబ్బై ఏళ్ళ వయసులో కూడా సంచలనమే...అన్నగారు నటించిన సినిమా విడుదలైతే రికార్డులే, వయసుతో నిమిత్తం లేకుండా......


వెండితెర రారాజు, రాజకీయ యవనిక పై ఆయనది చెరగని ముద్ర....... ఆంధ్రదేశం లో ఆయన తెచ్చిన రాజకీయ చైతన్యానికి వెలకట్టలేము ఎప్పటికీ.....


NTR, ఆ మూడు అక్షరాలు కలిస్తే..... పవర్... సంచలనం....నిత్యచైతన్యం....అనితరసాధ్యం.... నభూతోనభవిష్యతి...


అన్నగారి 90 వ జయంతి సందర్భంగా, ఏ లోకం లో ఉన్నా అదే చైతన్యం తో ఎన్నో సంచలనాలతో వర్ధిల్లాలని కోరుకొంటూ.....ఓ అభిమాని.

Monday, May 7, 2012

మా అమ్రిత్ పుట్టిన రోజు....పండగే...

2009 May 8th ఉదయం పది గంటలు నా జీవితం లో జరిగిన అద్భుతం నువ్వు రా నాన్నా.

అంతవరకూ ఏ పసి పాపనూ నా చేతులతో ఎత్తుకొని ఎరుగను... భయం, ఎక్కడ నా మొరటు చేతులు తగిలి నొప్పి కలుగుతుందో అని... కానీ నువ్వు పుట్టిన కొన్ని క్షణాలలోనే హాస్పిటల్ నర్స్ నిన్ను నాచేతిలో పెట్టిన క్షణం, ఆ క్షణం ఇంకా నా మదిలో అలానే ఉంది.. ఇక ఆ మధుర క్షణాన్ని మరిచిపోలేను కూడా ఎప్పటికీ....కానీ కొంచం సేపుతరవాత నన్ను నేను నమ్మలేదు... ఏమిటి నేను అప్పుడే పుట్టిన ఒక పసి వాడిని నా చేతులతో ఎత్తుకోవడమా.. అని.


దేశం కాని దేశం లో డాలర్ వెనక పడి పరిగెత్తే జీవిత హైరానా లో మన పండగలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు చాలా సార్లు.. తెలిసినా అది వారం మధ్య అయితే చేసేదేమీ ఉండదు కదా.. ఓహో ఈరోజు అదా అనుకోవటం తప్ప...

ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే మీ అమ్మ ఈ రోజు కృష్ణాష్టమి అట, ఫోన్ చేస్తే అమ్మ చెప్పింది అంటె అప్పటికప్పుడు నిన్ను చిన్ని కృష్ణునిగా తయారు చేసి.. ఆ వటపత్రశాయిని నీలో చూసుకున్న రోజు......



ఆస్ట్రేలియా వెళ్ళిన వారం నువ్వు కరెంటు ప్లగ్ పైన పడి ముఖానికి ఘాటు పెట్టుకొంటే, భాద పడి దేవుడే నీకు దిష్టి చుక్క పెట్టాడులే అనుకొన్న రోజు ఇంకా జ్ఞాపకమే, సిడ్నీ అన్న ప్రతీసారీ నువ్వు ప్లగ్గు మీద పడి అబ్బు అయ్యింది అంటూ ఇప్పటికీ ఆ దుర్ఘటన గుర్తుచేస్తూనే వుంటావు కాదా...ఆ జ్ఞాపకాల చిత్రమే ఇది..


నీ మొదటి జన్మదినం ఆస్ట్రేలియా సిడ్నీ


 సిడ్నీ లో జరుపుకున్నా.. కుటుంబ సంభందీకులు ఎవరూ లేరే అన్న లోటు ఉండకూడదని.. నీ బాబాయ్, మామ అతిథులుగా వచ్చినరోజు


నా చిన్నప్పుడు నేనే తయారు చేసిన గాలి పటం మేడమీద ఎగిరేసి ఆనందిస్తున్న నన్ను.... అమ్మ చూసి చదువు సంధ్య లేకుండా గాలి పటాలు ఎగారేస్తున్నావా అని అరిస్తే ఆ రోజుతరవాత మరీ ఎప్పుడూ ఆ ఊసే లేదు.. కానీ ఆ సరదా మరీ నీతోనే.. తీర్చుకున్నా... సిడ్నీ బొండై  బీచులో గాలి పటాల పండగ లో మరొక్క సారి నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుచేసావు ఆరోజు....


నాకు దీపావళి అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచీ ఆ పండగతో ఎన్నో జ్ఞాపకాలు...కానీ దేశం విడిచిన తరవాత ప్రతీ దీపావళీ రోజు ఏదో నిరాస నిస్పృహ.. జీవితంలో మరో దీపావళి ఒక్క పటాసు కూడా వెలిగించకుండానే గడిచిపోయిన్దా అని అనుకొన్న సందర్భాలు ఎన్నో.. కానీ నువోచ్చాక మరీ ఆ చిన్న నాటి రోజులు తిరిగి వచ్చాయి కాదా.. పెద్ద పెద్ద మతాబులు, తారాజువ్వాలు లేకున్నా కేవలం కాకరపూలు మాత్రమే కాల్చుకో గలిగినా నీతో కలిసి నా చిన్న నాటి జ్ఞాపకాలతో మరొక్క సారి చిన్న వాడిని అయ్యిన రోజు....



నీవు మాటలు మాట్లాడటం మొదలెట్టి ప్రతీదానికీ నీదైన పదం పలుకుతూవుంటే నీపేరుమీద ఒక చిన్న నిఘంటువు రాసుకొన్న రోజు ఇంకా జ్ఞాపకమే...
 
నీ రెండవ జన్మదినం చెన్నై సుప్పు, బుడ్డు,  తాత నానమ్మల సమక్షంలో....




స్కూల్ లో నీ మొదటి రోజు, నాకు మరీ నా చిన్ననాటి అరవింద్ ఆశ్రమం రోజులు గుర్తుకోచ్చిన రోజు...
నీ బొమ్మలతో నిన్ను ఆడిస్తూ అన్నీ మరిచిపోయి నీతో నీవయసువాడినై పోయి ఆడుతూవుంటే ఆహా మల్లీ నా చిన్నతనం వస్తే ఎంత బాగుండు అనుకొంటూ....


 రోజూ పడుకొనే ముందు బుక్కు చదుపిచ్చు నాన్న  అని నువ్వు రైమ్స్ బుక్కు తెస్తే,  నీతో చేరి నేను ఆ పాత పద్యాలను నెమరు వేసుకొంటూ తెలియని కొత్త పద్యాలను నేర్చుకొంటూ మరొక్కసారి చిన్న వాడిని అయిపోయి....


మూడవ జన్మదినం నీవు పుట్టిన దేశంలో జరుపుకోబోతున్న మా పెద్దరాజుల చిన్ని రాజా...
 


నీకు జన్మదిన శుభాకాంక్షలు..... మరెన్నో ఎన్నెన్నో జన్మదినాలు నీవు జరుపోకోవాలని, నీతో కలిసి నేనూ నా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకొంటూ ఆ అల్లరి మరీ ఇప్పుడు చేస్తూ గడపాలని కోరుకొంటూ, నీ ఉజ్వల భవిష్యత్తు ఆశిస్తూ...

....నాన్న





Saturday, May 5, 2012

మనిషిదే కులం?




మనిషే మనిషిని, మనిషిగా గుర్తింప జేయలేని ఈ కుల వ్యవస్థ మీద మనిషికి ఎందుకంత మక్కువ?

మనిషిని మూర్ఖుణ్ణి చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు అసహ్యం....

మనిషి ఆలోచనా శక్తిని హరింప చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు... వొళ్ళు మంట...

మనిషి సామర్థ్యాన్ని గుర్తించడానికి అడ్డు వస్తున్న ఈ కులవ్యవస్థ అంటె నాకు... కంపరం...

ఎదుటివాడిని నీదేకులం అని  నేను అడిగిన నాడు మనిషిగా నేను చచ్చిన రోజు.... 

కానీ నీదేకులం అని నన్నడిగే వాడిని ఏమిచెయ్యాలి భగవంతుడా?

నాకు ఆ మానసిక రోగాన్ని ఇవ్వనందుకు  నీకు మొక్కడం తప్ప..... నేనేమి చెయ్యగలను స్వామీ...