Wednesday, March 25, 2020

కర్మణ్యే వాధికారస్తే.......



అది సంవత్సరాంతం .......అప్పుడు పుట్టింది...కరోనా...చైనాలో...అలజడి.


ఇక్కడ అంతా మామూలుగానే ఉంది.....


ఫ్రెండ్ కలిసాడు... హయ్ అన్నాడు... షేక్ హ్యాండ్ ఇచ్చాడు... How are you? అన్నాడు...నేను ఫైన్ అన్నాను.....

అంతా మామూలుగానే ఉంది.....

కొత్త సంవత్సరం వచ్చింది...... పార్టీ జరిగింది....

అంతా మామూలుగానే ఉంది.....షరా మామూళ్

కరోనా పాకడం మొదలెట్టింది....

ఆఫీస్ వెళ్ళాను కొలీగు కలిసాడు... హాయ్ అన్నాడు... షేక్ హ్యాండ్ ఇచ్చాడు....నేనూ హాయ్ అన్నాను షేక్ హ్యాండ్ ఇచ్చాను....

అమ్మాయి వచ్చింది.... షేక్ హ్యాండ్ ఇచ్చింది... గాల్లో తేలినట్టుందే గుండె ఫేలినట్లుందే......మనసు లో ఓ కూని రాగం...

అంతా............. మా.....మూ...లుగానే...... ఉంది.....

కరోనా పరిగెత్తడం మొదలెట్టింది....

రుచి చూడ్డం మొదలయ్యింది...ఆకలి పెరిగింది...మింగడం మొదలెట్టింది....

కరోనా వేగం పెంచింది..... అది ఉసేన్ బోల్ట్ రికార్డులను, చిరుత పులి వేగాన్ని ఎప్పుడో దాటేసింది....

చైనీస్ (Cuisine)  రుచి తో మొదలు పెట్టింది......

దేశాలు.... సముద్రాలు.... ఖండాలు....దాటడం నేర్చుకొంది.
థాయ్..... కోరియన్...జపనీస్ ట్రై చేసింది....వేరే వేరే రుచులు మరిగింది...ఇప్పుడిప్పుడే రకరకాల రుచులు చూడ్డం మొదలయ్యింది.

అప్పుడు చిన్నగా అర్థం అవ్వడం మొదలయ్యింది... ఇది మనిషి నుంచి మనిషికి ఒకరిని ఒకరు తాకడం ద్వారా ఆక్రమిస్తోంది అని....

అది.... అప్పుడు మనకు గుర్తుకొచ్చింది మన సాంప్రదాయం..... ఇంక చూడు నా సామి రంగా.... నమస్కారం మన సాంప్రదాయం...మన హిందూధర్మo అంత గొప్పది ఇంత గొప్పది అని whats Up... internet...Tik Tok... మారు మొగి పోయాయి... పోతున్నాయి... అప్పటి వరకూ మనం పాటించని సాంప్రదాయం....ఎప్పుడో తాతల జమానా లో నే మరిచిపోయిన సనాతన ధర్మం.... ఫుంఖాను.. ఫుంకాలుగా రాతలు... అబ్బో.. పెద్ద పెద్ద మాటలు...

ఇంకోడoటాడూ....ఇప్పటివరకూ పుట్టిన వైరస్ లన్నీ లిస్టు వేసి ఏది ఎక్కడ పుట్టిందీ అని చెప్పి చూడు మన దేశం లో కుంభమేళాలు... పుష్కరాలూ జరుగుతుంటాయి కనీ ఒక్క వైరసూ పుట్టలేదు... మన సాంప్రదాయం ఎంత గొప్పదో...అని....ఇప్పుడు ఏమిజరుగుతోంది....ఆ కంపేరు చేయ్యడమేంది...

ఇంతలో కరోనా......అసలే దాని వేగం ఎక్కువ కదా......

పర్షియన్ ట్రై చేసింది...అందులో ఇరానియన్ బాగానే నచ్చింది.....దున్న మాంసం తిని దిట్టంగా ఉంటారు కదా....

కాంటినెంటల్ ట్రై చేసింది రుచి బాగుంది...ముఖ్యంగా ఇటాలియన్ బాగా రుచిగా ఉంది ఇటాలియన్ పాస్తా, పిజ్జాలూ, ఇటాలియన్ చీస్ తిని బాగా కొవ్వుపట్టిన శరీరాలు.... మస్తు నచ్చింది...కొంచం స్పానిష్, ఫ్రెంచూ కూడా వంటపడింది.

యూరోప్ లో ఉన్నప్పుడే....అక్కడక్కడా...మన ఇండియన్ రుచి అలా అలా పైపైగా కొన్ని శాంపిల్ చూసింది....స్పైసీ అనిపించిందేమో... చూద్దాంలే....మొదట మిగతావిఅన్నీ ట్రై చేద్దాం....తొందరెందుకూ....ఆ గంగాళం నిండుగా అట్లే ఉండనీ అనుకొంది....

అమెరికా....

ఆధునికతకు ఎంతో....అహంకారానికి అంతకు మించిన బ్రాండ్ అంబాసిడర్.....కంటికి కనిపించనిది ఇది మనల్ని పీకేదేంది అన్న నిర్లక్ష్యం.....

కరోనా అహాన్ని దెబ్బకొట్టింది......రుచి చూడ్డం మొదలయ్యింది.... నచ్చింది.....విజ్రుంభిస్తోంది......
విలయ తాండవం వైపు పరుగెడుతోంది.......

ఇంతలోనే గమనిస్తోంది....ఈ స్పైసీ సిల్లీఫెలోస్(ఇండియా) తనను అమెరికన్ల లాగే చిన్న చూపు చూస్తున్నారు అన్న తలంపు వస్తూంది చిన్నగా.....

పాలకులకు....కరోనా.. ఎంతటి సమర్త్దురాలో.అర్థం అవ్వసాగింది....ప్రజలకు నచ్చ చెప్పటం మొదలైయ్యింది.....
ప్రజల కుప్పిగంతులు కొనసాగుతున్నాయి........కరోనా చూస్తోంది...మన అజ్ఞానపు చేష్టలు

జనతా కర్ఫ్యూ అన్నదిబాగానే ఆచరించారు...అహోరాత్రులూ శ్రమిస్తూ..కరోనా మన రుచి మరగడాన్ని అడ్డుకోటానికి డాక్టర్లూ, పోలీసులూ ఇతర ప్రభుత్వ సిబ్భందికి కృతజ్ఞతగా చప్పట్లు చరచండి రా అంటే రోడ్డుమీదకోచ్చి సంబరాలు చేసుకోవడం...కరోనా కంట పడదు అన్న అజ్ఞానమా.....లేక అమెరికా వాళ్ళలాగా మనల్నిఇదేమిచేస్తుందన్న అహంకారామా.....ఆకతాయి తనమా

ఉండండిరా చెప్తా మీపని.....ప్రస్తుతం అమెరికా, ఇటలీ లో బిజీ గా ఉన్నా....చెప్తా... చెప్తా.....

కోరోనా ఇప్పుడిప్పుడే స్పైసీ రుచిమరగడం మొదలైయ్యింది..... 

ప్రజల తీరు పాలకులకు చిర్రెతుకోచ్చింది....వేరే దారి లేదు.....మొత్తం లాక్ డౌనే కరెక్ట్....మనం కరోనాకు దొరక్కుండా ఉండాలంటే ఇంట్లోనే... బయటికి కదలకుండా పెట్టాలి అదే మార్గం...ఇతర దేశాలు కూడా ఇదే మంత్రం జపిస్తున్నాయి.....కరోనా ఆశగా చూస్తోంది.. ఎవడు బయటికి వస్తాడా రుచి చూసేద్దాం అని....

ఏమిటి....ఏమిటి...ఏమిటీ చెయ్యడం......

చిన్న చిట్కా ఉంది.... ఓ మహానుభావుడు....ఎప్పుడో ద్వాపరం లో చెప్పాడు

చిట్కా నా...చెప్పాడా... ఎవరతను? ఎక్కడి వాడు? ఏంచెప్పాడు?

అతని పేరు Mr క్రిష్...all rounder....
అతను చెప్పింది ఇదే

 కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!


ఓ ఇదా.. ఇది మన శ్రీకృష్ణుడు కదా చెప్పింది....

అబ్బా బాగానే గుర్తుందీ..... మామూలుగా మనకు తెలిసినవే ఎవరో బయట వాళ్ళు చెప్తే మనకు బాగా వoట పడతాయి కదా అని Mr క్రిష్ అనిచెప్పా ఎఫెక్టివ్ గా ఉంటుందని.... పర్లే బాగానే గుర్తుంది....

సర్లే కానీ... ఏంటి దీనర్థం....

దీనికి చాంతాడంత అర్థం అవసరంలే.....

సూక్ష్మంగా... అంటే సింపుల్గా.....మనకర్తవ్యం మనం చెయ్యడం....

ఆ క్రిష్ణుడు ఫలితం ఆశించకుండా చెయ్య మన్నాడు.....కానీ ఆయనకు అప్పుడు తెలిసి నట్టు లేదు...మనం ఫలితం/లంచం లేకుడా ఏమీ చెయ్యమని...పాపం ఆమాయగాడు..సారీ...అమాయకుడు.

సర్సర్లే నీ సోది...ఏమిటా కర్తవ్యం.....

ఆ....ఇంట్లో కూర్చోవడం.....అదే ప్రస్తుత కర్తవ్యం....
కాలు బయటికి పెట్టకుండా...కుటుంభ సభ్యులతో హాయిగాఇంట్లోనే కాలం గడపడం....
దానికి ఫలితం కూడా ఉందిలే....

ఏంటా ఫలితం....

అదే ఇంకా కొన్ని కాలాలపాటు సురక్షితంగా ఈ భూమ్మీద పండిన నూకల పైన నీ పేరు ఉండటం....

కరోనా భారిన పడకుండా బతుకుతామని చెప్పొచ్చుకదా సింపుల్గా...ఈ డోoక తిరుగుడవసరమా....

ఎదో లేవో...సింబాలిక్ గా ఉంటుందని ట్రై చేశా....

ఇంకా....

ఇంకా అంటే ఇంకా ఉన్నాయ్....
మన పూరీ అన్న చెప్పినట్టుగా ఇంట్లో కూర్చొనే మన దేశ భక్తి చాటు కోవచ్చు..... మామూలుగా ఐతే అది మనమెట్లాగూ చెయ్యం.... ఇది బై ప్రోడక్ట్ అన్నమాట...మంచిదేగా....ఖాళీగా కూర్చొనే దేశభక్తి చాటొచ్చు.

ఇంకా....

ఇంకా ఏంటి ఇంకా.....
ఏమేం చెయ్యాలో ప్రతీదీ చెప్పాలా.....

ప్రస్తుతానికి అది నిన్ను రుచి చూడకుండా బ్రతికి బట్టకట్టు తరవాత చాలా చేస్కోవచ్చు.....అది ప్రస్తుతం అమెరికా, ఇటలీ ఇంకా వేరే దేశాల్లో బిసీ గా ఉంది ఈ లోపు జాగ్రత్త పడు.....

ఇంట్లో కూర్చొని మన వంట మనం రుచి చూస్కొంటూ తిందామా.... లేక మనమే కరోనాకు రుచికరం అవుదామా?







      ****     మన ప్రభుత్వాలు చెప్పినట్టు విందాం....
మన ఇంట్లోనే ఉందాం.......మనo జీవించి ఉందాం   ****