మాయాబజార్..... తిరిగి సాధ్యమా ఆ మాయ?
ఉగాది సందర్భంగా మా
అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చర్చకు వచ్చింది, మాయాబజార్ విడుదలై 55 సంవత్సరాలు
పూర్తీ చేసుకొన్న సందర్భంగా మనం ఏమన్నా రాయాలిరా అన్నాడు. నేను, మనమేమి రాస్తాము ఆ సినిమా మీద అన్నాను, ఇప్పటికీ/ఎప్పటికీ
తెలుగులో ఒక అద్భుత సినిమాగా కొనియాడబడే ఆ సినిమా మన ఊరి వాళ్ళు కదా తీసినది,
అందుకైనా ఏదన్న రాయాలి అన్నాడు, సరే
ఆలోచిద్దాం అన్నాను నేను.
చెప్పలేదు కదా నేను
పుట్టింది తాడిపత్రి(Anantapur Dt), మా అమ్మవాళ్ల ఊరు అది, నా చిన్నప్పుడు మేము మూలా(వాహిని స్టూడియో) వారి ఇంట్లో అద్దెకు
వుండేవారం. ఇప్పుడర్థమైయ్యిందా! మాఊరి వారు తీసిన సినిమా అని ఎందుకన్నానో....
సరే విషయానికి వద్దాం! ఆలోచిద్దాం అన్న నేను ఆలోచనలో పడ్డాను.. ఏమిరాయాలి? ... ఏమిరాయాలి?
అని.
మాయాబజార్ ఒక అధ్బుతం. అది ఎందుకు అద్భుతం? ఎంత అద్భుతం అన్నదాని మీద ఇప్పటికే చాలా వందల,
వేల విశ్లేషణలు/చర్చలు జరిగివుంటాయి. రచనలు వెలువడ్డాయి. మరి నేను
రాయటం అవసరమా?.... అదీ.. సినిమా అనే మాయా ప్రపంచంతో నా
అనుభవం/అనుభంధం ఇప్పటికీ కేవలం ప్రేక్షకుడి స్థాయే.
సో... సినిమా స్కూల్స్ లో పాట్యపుస్తకంగా నిలిచిన సినిమా గురించి విశ్లేషణా పూర్వకంగా రాసేంత స్థాయి మనకు లేదు అనుకొని, మన ఫిలింనగర్ అంతా మాయ, సినిమా ఎందుకు తీస్తున్నారో మాయ, ఎలా తీస్తున్నారో మాయ, విడుదల తరువాత ఆ సినిమా విజయం గురించి చేసే హంగామా అంతా మాయ. సినిమా తీయాలి అంటే ముందు కథ కన్నా హీరో డేట్లు ముఖ్యం అన్న మాయలో నడుస్తున్న ప్రస్తుత సినిమా‘యా’ ప్రపంచంలో, మరీ ఆనాటి మాయాబజార్ లాంటి అద్భుత మాయను సృష్టించడం సాధ్యమా అన్న అంశం మీద రాస్తే? అన్న ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా సినిమాకు సంభందించి ఒక్కొక్క అంశం తీసుకొని ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేద్దాం అనుకొన్నాను.
నిర్మాత/నిర్మాణ సంస్థ: మాయాబజార్ అన్న అద్భుతాన్ని
సృష్టించిన సంస్థ, అప్పట్లో ఆసియా లోనే అతిపెద్ద సినిమా స్టూడియో
కలిగిన విజయ వాహిని సంస్థ. ఇప్పటికీ తెలుగు వారు గర్వంగా చెప్పుకొనే ఎన్నో
సినిమాలు నిర్మించిన సంస్థ, అదే సంస్థకు ఆ నాటి ఆ మాయను మరీ
సృష్టించడం సాధ్యమా???
అదేమిటి అలా అంటావు, ఆ సంస్థ ఇప్పటికీ వుంది, సినిమాలు కూడా తీస్తోంది
మరి తలచుకొంటే అంతటి అద్భుత సినిమా మరీ తీయలేదా? అంటారా....నా అనుభవం చెబుతాను వినండి...కాదు చదవండి...
నేను జూలై 2011 లో ఇండియా లో వున్నప్పుడు టైంపాస్
కు ఏదో ఒక సినిమా చూద్దాం అని Old Mahabalipuram Road (OMR, Chennai) లో కొత్తగా ఓపెన్ చేసిన AGS
Cinema Multiplex కు, మార్నింగ్ షో టైములో వెళితే, ధనుష్ సినిమా Venghai పోస్టర్
కనిపించి, సరే ధనుష్ సినిమా చూడక చాలా రోజులే అయ్యిందికదా అని
టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను.. అప్పుడే తెలిసింది ఆ సినిమా ఆ రోజే విడుదల అని,
సినిమా ప్రారంభం లో విజయ వాహిని వారి లోగో చూసి అరె ఇది మన విజయా
వారి సినిమా, అయితే నేను మంచి సినిమాకే వచ్చాను అనుకొని ఆనంద
పడ్డా...విజయా వారి సినిమా అంటే అంత నమ్మకం మనకు.
నా ఆనందం ఎంతోసేపు
నిలవలేదు..కారణం ఏంటంటే..
నా అంచనా, అవగాహన ప్రకారం తెలుగు సినిమాలో వల్గారిటీ కి పరాకాష్టగా పరిగణింపబడేవి
రెండు..
ఒకటి అల్లుడా మజాకా లో ఇద్దరు హీరోయిన్స్ తో పాటు వారి అమ్మకారక్టర్ తో కలసి మన హీరో గారు చేసే బెడ్రూమ్ కామెడీ... రెండవది రౌడీ ఇన్స్పెక్టర్ లో బ్రమ్హానందం కామెడీ (పీడకలగా మరచిపోయిన వాటిని మళ్ళీ గుర్తు తెచ్చినందుకు క్షమించాలి!)
Venghai లో
కామెడీ ఈ రెండింటికీ మించిపోయివుంటుంది. ఒకసారికాదు, సినిమాలో
కామెడీ కావాలి అని దర్శకుడు అనుకొన్న ప్రతీసారీ అదే వచ్చి వచ్చి చంపుతుంది... అసలు
మొత్తం సినిమా ఎలా వుంది అన్న విషయం పక్కనపెడితే నేను ధియేటర్ లో నుంచి బయటికి
వస్తూ ... ఛ మన చందమామ వారా ఈ సినిమా తీసింది అన్న బాడ్ ఫీలింగ్తో వచ్చాను.. ఆ
వీకెండ్ హిందూ దినపత్రికలో రివ్యూ చదివాను అంతా పాసిటివ్గానే వుంది.. కానీ నా
మనసులో ఇప్పటికీ అదే బాడ్ ఫీలింగ్..
సో మారుతున్న మార్కెట్ కు
అనుగుణంగా తమ సంస్థ ప్రతిష్టనే ఫణంగాపెట్టి సినిమాలో మసాలా దట్టిస్తున్న మన విజయా
వారు మరోసారి ఆ మాయ చెయ్యగలరన్న నమ్మకం వుందంటారా...
దర్శకులు:
కె.వి రెడ్డి అంత స్థాయిలో కాకపోయినా, మనకు ఇప్పటికీ
మంచి దర్శకులు వున్నారు, కానీ అందరూ ఇదివరకే సక్సెస్ అయిన తమ
సినిమా ఫార్ములాతోనే కొత్త సినిమాలు తీస్తున్నారు గానీ, కొత్తగా
చేద్దాం అన్నదే లేకుండా పోతోంది.. మరి ఎవరన్నా ధైర్యం చేసి వైవిధ్యంగా తీయాలి
అనుకొన్నా... మన హీరోలకు అర్థం అవ్వాలి కదా కొత్త కాన్సెప్ట్...సినిమా ఆడింది అంటే
అందులో దర్శకుడి ప్రతిభకన్నా కేవలం తమ వల్లే అని మన హీరోలు జబ్బలు చరిచే ఈ
రోజుల్లో..మన దర్శకులకు ఆ పాత మాయ చేసే ఛాన్స్ వస్తుందంటారా?
సంగీతం:
అవసరం ఉన్నా లేకున్నాతెలిసిన వాయిధ్యాలన్నీ వాడెయ్యాలి, గాయకుని గొంతు
వినిపించకూడదు అదే సంగీతం..ఇదీ మన సంగీతదర్శకుల వరస.
రేయ్ సంగీతం గురించి నీకేమి
తెలుసని మాట్లాడుతున్నావ్? అంటారా...
నామటుకు నాకు
అనిపించేదేమంటే, సంగీత జ్ఞానం లేనివాడిని సహితం అలా నిలుచోపెట్టి ఆహా ఏత హాయిగా
ఉంది వింటూంటే అని అనిపించ గలగటంలోనే వుంది సంగీత విద్వాంసుని నైపుణ్యం అంతా, కాదంటారా....
గాయనీగాయకులు: తెలుగు రాకపోవడం ముఖ్య అర్హత వీరికి, బొంగురు గొంతు వేసుకొని పిచ్చ, పిచ్చగా అరవటమే....తెలుగు భాషలోని అందం, పదాల ఉచ్చారనలోని మాధుర్యం మన తెలుగు పాటలో వెతుక్కొన్నా కనిపిస్తుందా ఇప్పుడు.
ఇకపోతే...
నటీనటులు: వందమందిని
ఒక్కచేత్తో కొట్టేవాడే హీరో..సినిమాకు అవసరం వున్నా, లేకున్నా
అలాంటి సందర్భం కల్పించి నటించి, సారీ తన్ని, గొప్ప యాక్టర్లు అనిపించుకోవడమే నేటి హీరోల ధ్యేయం...
ఇక మన హీరోయిన్ గురించి
ఏమి చేప్తాము చెప్పండి, భాష రాకపోతే పోయె, కనీసం
సందర్భాన్ని బట్టి నటించాలన్న ఆలోచన లేని నటీమణులు వారు. మాయాబజార్ లాంటి కథతో
వెళితే తన టాలెంటు “చూపించే” అవకాశమే
లేదు అని తిరస్కరించినా ఆశ్చర్యం లేదు.....కొంచం ఎక్కువైంది కదా..... మీరే
చెప్పండి మరి ఇప్పటి హీరోయిన్ పరిస్థితి....ఒక సినిమాలో గ్లామరుస్ గా
కనిపించలేదంటే తరవాత అవకాశాలు వస్తాయో, రావో అన్న అనుమానంలో,
అయోమయంలో మన తెలుగు సినిమా హీరోయిన్ వుందిప్పుడు..
ఇవన్నీ వదిలెయ్యండి, మాయాబజార్ లాంటి సినిమా ఇప్పుడు తీయటం కుదరదు అని ఘంటాపథంగా చెప్పటానికి
నాకు మూడు కారణాలు వున్నాయి..
ఒకటి: ఘటోత్కచుడు: రంగారావు గారు
రెండు: కృష్ణుడు: అన్న
రామారావు గారు
మూడు: శశిరేఖ: సావిత్రి
గారు.
మన సినిమా పరిశ్రమను మనమే
తక్కువ చేయ్యడమేమిటి, మనవారు అనుకొంటే ఏదైనా సాధించగలరు అంటారా...
సరే, మన విజయా సంస్థనే మరొక్కసారి ఆ మాయ రిపీట్ చెయ్యడానికి పూనుకొంది
అనుకొందాం, ఘటోత్కచుని లాంటి పాత్రకు రంగారావు గారితో సమాన
విగ్రహపుష్టి కలిగిన వాడిని పెట్టి మేనేజ్ చేసేద్దాం అనుకొవచ్చు, కృష్ణుని పాత్రకు రామారావు అంతకాకపోయినా దరిదాపు ముఖవర్చస్సు ఉన్న వారిని
తెచ్చి నిలుచోపెట్టి మేనేజ్ చేసేద్దాం అనుకొన్నా.. మరి శశిరేఖ పాత్రకు మరో
సావిత్రి దొరుకుతుందా....
మాయాబజార్ లో సావిత్రి
గారు చేసిన మాయ ఎప్పటికీ మరువలేనిది, కళ్ళు పెద్దవి
చేసి చూసే ఆమె చూపు, ఆమె బుంగమూతి విసుర్లు మరిచిపోతామా
ఎప్పటికైనా...
ఈ ఒక్కటి చాలదూ ఆ మాయను
తిరిగి సృష్టించడం మనకు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పటానికి....
****
విడుదలై 55 వసంతాలు పూర్తీ చేసుకొన్న ఆ
చిత్రరాజానికి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఆ చిత్రం
నిర్మాణానికి ప్రత్యక్ష సాక్షులుగా ఇంకా మన ముందు ఉన్న అక్కినేని నాగేశ్వర రావు
గారికి, సింగీతం శ్రీనివాస రావు గారికి, ఆ చిత్రాన్ని నిర్మించిన విజయ వాహినీ సంస్థకు నా హృదయపూర్వక అభినందనలు
మరియు ధన్యవాదాలు.
సమాప్తం.
